
పటేల్, నేతాజీని కాంగ్రెస్ పట్టించుకోలేదు: వెంకయ్య నాయుడు
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సర్దార్ వల్లభభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పక్కనపెట్టి, ఒకే కుటుంబాన్ని పొగిడే ధోరణిని కొనసాగించాయని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. వడోదర లోని ‘సర్దార్ @150 యూనిటీ మార్చ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఐక్య పాదయాత్ర దేశ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. నవంబర్ 26న కారంసాద్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర డిసెంబర్ 5న ఏకతా నగర్, నర్మదా జిల్లా లోని స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ముగియనుంది.
రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గతంలో ఒక అమెరికా నాయకుడు చేసిన వ్యాఖ్య అయిన ‘ఇండియా డెడ్ ఎకానమీ’ని పదే పదే దేశంలో ప్రతి ధ్వనింపజేశారని విమర్శించారు. ఇక మరుసటి రోజే ఐఎంఎఫ్ భారత్‌ను ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ప్రకటించిందని నాయుడు గుర్తుచేశారు. భారతదేశం వేగంగా ఎదుగుతోంది. ఈ సమయంలో దేశంలో ఐక్యత అత్యవసరం అన్నారు.
పటేల్ చూపిన మార్గమే దేశానికి దారి
ముందు దేశం, తర్వాత పార్టీ, స్వయం చివర అనే పాఠాన్ని పాటిస్తేనే దేశ పురోగతి సాధ్యమని తెలిపారు. జాతి, మతం, వర్గం అనే భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశం కోసం కలిసి పని చేయాలన్నారు. భారత్ ఐక్యతకు ప్రతీకగా ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణం దేశానికి మన్నన తెచ్చిందని, దీన్ని సాకారం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. చారిత్రక కేంద్రంగా కేవాడియా మారిందన్నారు.
యువతకు ప్రేరణ యాత్ర
ఈ యాత్రలో కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవియా, అన్నపూర్ణా దేవి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 750కు పైగా జిల్లాలు, 1,500కిపైగా గ్రామాల్లో ఒక్కరోజు పాదయాత్రలను నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ ప్రయాణం ఐక్యత, స్వావలంబన, అభివృద్ధి భారత నిర్మాణానికి పునాది అని మండవియా చెప్పారు.
