Let's talk: editor@tmv.in
పిటిషన్ ఉపసంహరించుకోండి

పిటిషన్ ఉపసంహరించుకోండి

Pinjari Chand
25 సెప్టెంబర్, 2025

పార్లమెంట్​ పై దాడి చేసిన కేసులో అరెస్టై, తర్వాత ఉరి తీయబడ్డ అఫ్జల్​ గురు, జేకేఎల్​ఎఫ్ వ్యవస్థాపకుడైన మక్బూల్ భట్​ ల సమాధులను తీహర్​ జైలు నుంచి తొలగించాలన్న పిటిషన్ ను జస్టిస్​ దేవేంద్ర కుమార్​ ఉపాధ్యాయ, జస్టిస్ గేదేల తుషార్​ రావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా విశ్వవేద సనాతన్​​ సంఘ్​ ద్వారా పిటిషన్​ వేసిన న్యాయవాది బరుణ్​ సిన్హాకు బెంచ్ సూచిస్తూ పిటిషన్​ ఉపసంహరించుకోండి లేదా సరైన ఆధారాలతో మళ్లీ పిటిషన్​ దాఖలు చేయాలని సూచించింది.

యాత్ర స్థలాలుగా మారాయి

తీహార్​ జైలులోని నంబర్​ 3 సమీపంలో ఉన్న వీరి సమాధులు కొన్ని తీవ్రవాద శక్తులకు తీర్థ యాత్ర స్థలాలుగా మారాయని, ఇది 2018 ఢిల్లీ మున్సిపల్​ కార్పోరేషన్​ చట్టాన్ని, జైళ్ల నియమాలను ఉల్లంఘిస్తోందని పిటిషన్​ లో పేర్కొన్నారు. అయితే ప్రజలు అక్కడికి వెళ్లి నివాళులర్పిస్తున్నట్లయితే అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోర్టు ఈ సందర్భంగా కోరింది. పన్నెండు సంవత్సరాల తర్వాత దీన్ని సవాల్ చేయవచ్చా? అని పిటిషనర్ ను జస్టిస్​ ఉపాధ్యాయ ప్రశ్నించారు. అయితే వాదోపవాదాల తర్వాత న్యాయవాది సిన్హా పిటిషన్ ఉపసంహరించుకోవడానికి అనుమతి తీసుకుని, మళ్లీ అధారాలతో వేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో కోర్టు ప్రస్తుత పిటిషన్ ను కొట్టివేసింది.

తక్షణ జోక్యం చేసుకోవాలని డిమాండ్

తీహార్​ సెంట్రల్​ జైలులో ప్రాంగణంలో ఉన్న ఉగ్రవాదుల సమాధులు తొలగించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం కోర్టు తక్షణ జోక్యం చేసుకోవాలని పిటిషనర్​ తరుపు న్యాయవాది కోరారు. ఉరితీసిన వారి సమాధులను సందర్శించకుండా చూడాలని, వెంటనే అక్కడి నుంచి తరలించాలని అడిగారు. అజ్మల్​ కసబ్​, యాకూబ్​ మెమన్​ లాంటి తీవ్రవాదుల విషయంలో ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకున్నట్లు ఆదేశించాలని పిటిషనర్లు కోరారు.

పిటిషన్ ఉపసంహరించుకోండి - Tholi Paluku