
పెట్టుబడులకు ఏపి అనుకూలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పలువురు ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్నాయి. నేడు సచివాలయంలో ఆర్ & బీ శాఖ కార్యాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని రిఫెక్స్ ఎయిర్ పోర్ట్స్ & ట్రాన్స్ ఫోర్టేషన్, మనో ఎయిర్ క్రాప్ట్ సర్వీసెస్, డలాప్ట్ ఎయిరో స్పేస్ సంస్థల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. చెన్నైకి చెందిన రిఫెక్స్ సంస్థ ఇప్పటికే పుణే, శ్రీనగర్ విమానాశ్రయాల్లో పెట్టుబడులు పెట్టి, ఇప్పుడు దేశంలోని మరో పన్నెండు ఎయిర్‌పోర్టుల్లో పెట్టుబడులు పెట్టాలని సిద్ధమవుతోంది. ఏపీలో కూడా కొత్త విమానాశ్రయాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆసక్తి వ్యక్తం చేసింది.
మనో ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీసెస్ (కొయంబత్తూర్) ప్రతినిధులు రాష్ట్రంలో 2 సీటర్, 3 సీటర్ విమానాల ఉత్పత్తి యూనిట్ స్థాపనపై ఆసక్తి వ్యక్తం చేశారు. త్వరలో పూర్తి స్థాయి ప్రతిపాదనలతో ముందుకు వస్తామని తెలిపారు. డలాప్ట్ ఎయిరో స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (చెన్నై) సంస్థ ప్రతినిధులు వ్యవసాయరంగంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం, ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు తమ ఆసక్తి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం నెలకొంది అన్నారు. సుస్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం వలన పెట్టుబడుల వెల్లువ మొదలైందని తెలిపారు. ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెరగడంతో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో ఏవియేషన్ హబ్‌గా మారనుందని మంత్రి పేర్కొన్నారు.
