Let's talk: editor@tmv.in
పచ్చబొట్టు చెరిగి పోదులే...

పచ్చబొట్టు చెరిగి పోదులే...

FL - BHAVN
22 సెప్టెంబర్, 2025

పచ్చబొట్టు దీన్నే ఇప్పుడు మనం టాటూ గా సంబోధిస్తున్నాము. పచ్చబొట్టు ఒకప్పుడు ఏదో ఆటవిక సంప్రదాయంగా, కొన్ని తెగల్లో మాత్రమే ఆచరించే సంస్కృతిగా ఉండేది. కానీ ఇప్పుడు టాటూయింగ్ అనేది ఒక విప్లవాత్మకమైన ఫ్యాషన్ ప్రక్రియ. తమతమ వ్యక్తిగత అభిరుచిని, అభిప్రాయాన్ని వ్యక్తీకరించే కళారూపంగా రూపాంతరం చెందింది. శరీరాన్ని క్యాన్వాస్ గా మార్చే ఈ కళారూపం ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకర్శిస్తోంది. యవతరం ఆదరణను పొందింది. యువత మాత్రమే కాదు చాలా మంది నడివయస్కులు అంతకు మించిన వయసు కలిగిన వారు కూడా వీటి మీద మక్కువ పెంచుకున్నారు. చిన్నా చితక పచ్చబొట్లు పొడిపించుకోవడానికి వెనుకాడడం లేదు. అందరికీ నచ్చే పచ్చబొట్ల గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

పచ్చబొట్టుకెందుకీ ఆకర్షణ

మనదేశంలో కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని సంస్కృతుల్లో ఒంటి మీద పచ్చబొట్టు కనిపించేలా వేయించుకోవడం ఒక సంప్రదాయం. అదొక ఆచారంగా చాలా శతాబ్ధాలుగా కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు అది ఒక ఫ్యాషన్ ప్రక్రియ గా మారిపోయింది. శరీరాన్నే క్యాన్వాస్ గా మార్చి తన అభిప్రాయాన్ని సూచనగా బయటకు తెలిపే ఈ టాటూయింగ్ కళారూపంగా ఆవిర్భవించింది. ఇది వ్యక్తిత్వ వ్యక్తీకరణగా అనిపించడం వల్ల యువతకు ఎంతో నచ్చింది. అందువల్ల దాదాపు దశాబ్ధ కాలంగా ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా విస్తృతంగా ట్రెండ్ లో ఉంది.

పచ్చబొట్టు వేయించుకోవడం ఫ్యాషన్ అయితే పచ్చబొట్టు వెయ్యడం ఒక కళ. నిపుణులైన టాటూ ఆర్టిస్టులు చర్మాన్నే క్యాన్వాస్ గా ఉపయోగించి అద్భుతమైన డిజైన్లను సృష్టిస్తారు. క్లయింట్ అభిరుచికి తమ సృజనాత్మకతను జోడించి మానవ చర్మం మీద రూపొందించే కళారూపం టాటూయింగ్. పచ్చబొట్టు డిజైన్ అందులో ఉపయోగించిన రంగులను అర్థాన్ని బట్టి కచ్చితంగా చూసే వారి దృష్టిని ఆకర్శిస్తుంది.

కొన్ని సార్లు కొన్ని చిన్నచిన్న లోపాలను కప్పిపుచ్చుకోవడానికి కూడా పచ్చబొట్టు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రమాద వశాత్తు శరీరం మీద ఏర్పడిన మచ్చల వల్ల కొంత మంది ఆత్మన్యూనతకు లోనవువుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో అలాంటి మచ్చలను పచ్చబొట్టు డిజైన్ లో కలిసిపోయేలా చేయవచ్చు.చెప్పాలంటే ముందు కంటే కూడా ఆకర్షణీయంగా కనిపించేలా చెయ్యవచ్చు. ఫలితంగా కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి సంతరించుకోవచ్చు. ఇలా కొన్ని సార్లు పచ్చబొట్టు అనివార్యం కూడా అవుతోంది.

ఒక్కోసారి కొన్ని జ్ఞాపకాలు అత్యంత విలువైనవిగా తోస్తాయి. వాటిని మనసులో భద్రపరచుకోవడం కంటే అనుదినం కంటి ముందు కనిపించేలా ఉంచుకోవడం చాలామందికి నచ్చుతుంది. ఉదాహరణకు కొంత మంది తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పచ్చబొట్టు వేయించుకుంటారు. మరి కొందరు స్నేహానికి గుర్తుగా, మరి కొందరు జీవితంలోని ఏదో ఒక సందర్భాన్ని శాశ్వతం చేసుకునేందుకుగానూ టాటూలు వేయించుకుంటూ ఉంటారు. ఇలాంటి టాటూలు భావోద్వేగాలను పదిల పరిచే డైరీల వంటివి.

కొంతమంది సామాజికంగా వారి మధ్య అనుబంధాన్ని తెలిపే సాధనంగా పచ్చబొట్టును వినియోగిస్తారు. ఇదో రకమైన సామాజిక సమూహానికి ప్రతీకగా ఉంటుంది. అందుకుగానూ టాటూ కన్వెన్షన్లు, సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటయ్యాయి.

నష్టాలూ ఉన్నాయి

ఇటువంటి ట్రెండీ, క్రేజీ విషయాలు పచ్చబొట్టుకు ఒక రూపం అయితే దీనికి మరో కోణం కొంచెం ఇబ్బంది కలిగించేదిగా కూడా ఉంటుంది. ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా ఉండొచ్చు. ఆ వైపుకూడా ఒకసారి చూడకపోతే అవగాహనా రాహిత్యం అవుతుంది.

పచ్చబొట్టు వేయించుకోవడం అనేది సూదితో గుచ్చడం ద్వారా చేసే ప్రక్రియ. పచ్చబొట్టు వేసే సమయంలో సరైన భద్రతా విలువలు పాటించకపోతే ప్రమాదకరమైన అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం పొంచి ఉంటుంది. అందులో హెపటైటిస్, హెచ్ఐవీ వంటి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు కూడా ఉండవచ్చు. పచ్చబొట్టు వేసేందుకు ఉపయోగించే సూదులు నాణ్యమైనది కాకపోతే రకరకాల చర్మ సంబంధ ఇబ్బందులు రావచ్చు. చర్మం పై తీవ్రమైన అలెర్జీలు, దద్దుర్లు, వాపు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఎప్పడూ ఉంటుంది.

కొన్ని వృత్తుల్లో ఉన్న వారికి పచ్చబొట్లు వేయించుకోవడం నిషేధం. పచ్చబొట్టు వేయించుకున్న వారికి కొన్ని ప్రత్యేక ఉద్యోగాలకు నియమించుకోరు. ముఖ్యంగా శరీరంలో బహిర్గతమయ్యే భాగంలో కనిపించే విధంగా పచ్చబొట్ల పట్ల అభ్యంతరాలు ఉంటాయి. వీటిని నిబంధనలకు వ్యతిరేకంగా భావి స్తారు. రక్షణశాఖలో, కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో ఇలాంటి నిబంధనలు ఉన్నాయి.

సంప్రదాయ సమాజాలలో పచ్చబొట్టు వేయించుకోవడం నిషేధం. సంప్రదాయ విరుద్ధం. టాటూ వేయించుకోవడం దైవవిరుద్ధ కార్యంగా భావిస్తారు. పచ్చబొట్టు వేయించుకున్న వారిని సమాజం నుంచి వెలివేసే కఠినమైన కట్టుబాట్లు ఉన్నాయి.

పచ్చబొట్టు వేయించుకోవడం కొంచెం నొప్పితో కూడుకున్న వ్యవహారం. డిజైన్ పెద్దగా ఉన్నప్పుడు నొప్పి ఎక్కువే ఉంటుంది. పచ్చబొట్టు వేయించుకోవడానికి తీసుకునే సమయం, ఖర్చు కూడా ఎక్కువే. వేయించుకున్న పచ్చబొట్టు పాడైపోకుండా కాపాడుకునేందుకు అదనపు ఖర్చు కూడా కావచ్చు.

కొన్ని టాటూలు భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. కాలం గడిచే కొద్దీ ఆ భావోద్వేగాల గాఢత తగ్గిపోవచ్చు. అప్పుడు ఆ టాటూ వద్దని కూడా అనిపించవచ్చు. దాన్ని తొలగించడం అప్పుడు కష్టమవుతుంది. తిరిగి దాని కోసం కూడా డబ్బు ఖర్చు అవుతుంది. కొన్ని సార్లు పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోవచ్చు.

జాగ్రత్తలు కూడా అవసరమే

పచ్చబొట్టు వేయించుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నమ్మకమైన అనుభవం కలిగిన ఆర్టిస్ట్ దగ్గర మాత్రమే పచ్చబొట్టు వేయించుకోవాలి. టాటూ వేయించుకునే పరిసర వాతావరణం పరిశుభ్రతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి సారీ కొత్త సూది మాత్రమే ఉపయోగించాల్సిందిగా వారిని కోరాలి. తప్పకుండా కొత్త సూది వాడుతున్నారనేది నిర్థారించుకున్న తర్వాత మాత్రమే చేయించుకోవాలి. ఉపయోగించే సూది కచ్చితంగా నాణ్యమైనదేనా తెలుసుకోవాలి. పచ్చబొట్టు వేసుకున్న తర్వాత వారు సూచించే జాగ్రత్తలు తప్పక పాటించాలి.

పచ్చబొట్టు వేయించుకోవడం ఎప్పుడైనా ఒక వ్యక్తిగత నిర్ణయం. దీనిలోని లాభనష్టాలను బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇది కేవలం క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం కాదు. దాని వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను, వృత్తిగత, వ్యక్తిగత పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. సరైన అవగాహనతో ఇప్పుడు వేసుకునే పచ్చబొట్టు భవిష్యత్తులో పశ్చాత్తాపానికి కారణం కాకుండా ఉండేలా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం.

పచ్చబొట్టు చెరిగి పోదులే... - Tholi Paluku