
పాక్ రక్షణ ఖర్చులు బయటపెట్టండి
పాకిస్తాన్ రక్షణ, గూఢచార విభాగాల కోసం చేస్తున్న ఖర్చులపై వివరాలు బయట పెట్టాలని అమెరికా సూచించింది. తక్షణమే ఈ వివరాలన్నీ పార్లమెంట్ లేదా పౌర పర్యవేక్షణలోకి తీసుకురావాలని కోరింది. ప్రజల మద్దతు పొందాలంటే ఖర్చులపై పారదర్శకత అవసరమని స్పష్టం చేసింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన 2025 ఫిస్కల్ ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్‌లో ఈ విషయాలు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల్లో ప్రభుత్వాలు బడ్జెట్ ఎలా ఖర్చు చేస్తున్నాయి, దీనికి సంబంధించి వివరాలు ఎంతమేరకు అందుబాటులో ఉన్నాయి, ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుందా? లేదా?, ఆడిట్ ఎలా జరుగుతోంది అనే అంశాలను ఈ నివేదికలో ప్రస్తావించారు.
పాక్‌లో నిర్వహణ అంతా అస్తవ్యస్తమే
పాకిస్తాన్ బడ్జెట్ నిర్వహణపై అమెరికా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రక్షణ, గూఢచార శాఖలకు సంబంధించిన ఖర్చులు పార్లమెంట్ పర్యవేక్షణలో లేవని తెలిపింది. పాక్ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనను సమయానికి ప్రకటించలేదని, ప్రభుత్వ రుణాలపై పూర్తి సమాచారం ఇవ్వలేదని విమర్శించింది. గత బడ్జెట్, ఖర్చుల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడంపై హర్షం వ్యక్తం చేసింది. ప్రకృతి వనరుల అనుమతులు, ఒప్పందాల వివరాలు ప్రజలకు చూపించడం సానుకూలమైన అంశమని వ్యాఖ్యానించింది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. 2025–26 బడ్జెట్ ప్రకారం మొత్తం రూ.17.57 లక్షల కోట్లు కేటాయించింది. ప్రభుత్వ నూతన ప్రాజెక్టులు, పెన్షన్లు, రక్షణ, ఆరోగ్యం, విద్య, జీతాలు, రుణాల కోసం ఖర్చు చేయనుంది. పాకిస్తాన్ ఇప్పటి వరకూ తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడానికి, అప్పులు కట్టడానికి ఇందులో రూ.9.7 లక్షల కోట్లు వాడతారు. మరో రూ. 2.55 లక్షల కోట్లు రక్షణ రంగానికి కేటాయించారు. గత సంవత్సరం కంటే దాదాపు 20 శాతం ఎక్కువ నిధులు కేటాయించారు.
అమెరికా సూచనల వెనుక ఉద్దేశం
పాకిస్తాన్ సైన్యం, ఉగ్ర కదలికలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. భారత్ సహా పలు దేశాలు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ పాలనలో పారదర్శకత పెరగాల్సి ఉందని అమెరికా ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. దేశం అంతర్జాతీయ పెట్టుబడులు, ఆర్థిక సహాయం పొందాలంటే, ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం కలిగి ఉండాలంటే ఇది అవసరమని చెప్పింది. పాకిస్తాన్ రక్షణ వ్యయాలు రోజురోజుకీ పెరుగుతున్నా, అవి ఎలా ఖర్చవుతున్నాయో చెప్పకపోవడం అంతర్జాతీయంగా ఆందోళనకు దారి తీస్తోంది. అమెరికా ఈ అంశంపై పాకిస్తాన్‌ను పౌర నియంత్రణ వ్యవస్థల్లోకి తీసుకురావాలని కోరుతోంది. పాక్ సర్కార్ ఈ సూచనలను పాటిస్తుందా? లేక మిలటరీ ఆధిపత్యం కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి.
