
పాక్ ఉగ్ర బాధితులకు న్యాయం జరగాలి
పాకిస్తాన్ సహకారంతో జరిగిన ఉగ్ర దాడుల్లో బాధితులకు న్యాయం జరగాలని కశ్మీర్ మానవ హక్కుల కార్యకర్త, ఉగ్రవాద బాధితురాలు తస్లీమా అఖ్తర్ అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. తన చిన్నప్పటి దుర్ఘటనను గుర్తు చేసుకుంటూ జమ్ము కశ్మీర్‌లో పాక్ సహకారంతో ఉగ్రవాదం వల్ల లెక్కలేనన్ని కుటుంబాలు బాధపడుతున్నాయని చెప్పారు. మానవ హక్కుల కార్యకర్తగా, కశ్మీర్ బిడ్డగా మా బాధను చెప్తున్నానంటూ తస్లీమా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా 1999 ఏప్రిల్ 11న జరిగిన సంఘటనను గుర్తు చేశారు. తనకు పదకొండు సంవత్సరాల వయసులో తన తండ్రి, అన్నయ్యను స్థానిక మిలిటెంట్లు పాక్ మద్దతున్న ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారన్నారు. ఎన్నో చిత్రహింసలు పెట్టిన తర్వాత తన తండ్రిని విడుదల చేశారన్నారు. తన అన్న ఏడు రోజులు బందీగా ఉన్నాడని, ఆ ఘటన వల్ల తమ కుటుంబం స్వగ్రామం వదిలి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. "ఆ క్షణం నుంచి నా బాల్యం దోచుకున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
తస్లీమా తనతో పాటు తన స్నేహితుల కష్టాలు కూడా వివరించారు. ఉగ్రవాదం వల్ల తన మిత్రులు ఎంతో మంది అనాథలుగా మారారన్నారు. పాఠశాల స్థాయిలోనే తల్లిదండ్రులను కోల్పోయి జీవితాలు నాశనమయ్యాయని చెప్పారు. కశ్మీర్‌లో ఇలాంటి దుర్ఘటనలు ఒక్కరిద్దరు అనుభవించరని, ఇది కశ్మీర్ ఉగ్రబాధితుల సమిష్టి బాధ అని తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రాంతాన్ని నాశనం చేస్తోందని చెప్పారు. తరగతి గదులలోనే తమ ఉపాధ్యాయులను హత్య చేశారన్నారు. వలసదారులను కూడా హతమార్చారాని చెప్పారు. మసీదులు, ఆలయాల్లో పూజ చేస్తున్నవాళ్లపై కూడా దాడులు జరిగాయన్నారు. కశ్మీర్ పండిట్లు మొత్తం సమూహాలుగా, బలవంతంగా బయటకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. తస్లీమా వ్యాఖ్యలు కశ్మీర్‌లో ఉగ్రవాద బాధితుల కష్టాలను ప్రపంచానికి కళ్లకుకట్టినట్లు చూపించాయి.
తస్లీమా ముఖ్య సిఫారసులు
తస్లీమా ఈ సందర్భంగా ప్రపంచ దేశాలకు మూడు ముఖ్య సిఫారసులు చేశారు. కశ్మీర్‌లోని ఉగ్రవాద బాధితుల మానవ హక్కుల ప్రాధాన్యతను గుర్తించాలని కోరారు. ఉగ్రవాదానికి సహకారం అందిస్తున్న దేశాలు, ముఖ్యంగా పాక్ మిలిటెంట్లకు శిక్షణ ఆయుధాలు ఇవ్వడంపై జవాబుదారీతనం విధించాలన్నారు. వితంతువులు, అనాథలు, వలస వెళ్లిపోయిన కుటుంబాలకు పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. తస్లీమా ప్రసంగం ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేసింది. తాము ప్రతీకారం కోరట్లేదని, న్యాయం కోరుతున్నామంటూ కశ్మీర్ ఉగ్ర ప్రభావిత ప్రజల తరఫున గళాన్ని వినిపించింది. సామాన్య ప్రజలు యుద్ధాన్ని కోరుకోరని, శాంతికే ప్రాధాన్యత ఇస్తారని తస్లీమా స్పష్టం చేశారు. ప్రపంచమంతా ఏకమై కశ్మీర్‌ను శాంతి, మానవత్వానికి కేంద్రంగా మార్చాలని కోరారు.
భారత్‌కు ఇదే మంచి తరుణం
ఇటీవల పలు దేశాలు అంతర్జాతీయ వేదికలపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తున్నాయి. ఇటీవల ఐరాసలో భారత ప్రతినిధి పహల్గామ్ దాడి గురించి ప్రస్తావిస్తూ పాక్‌పై చేసిన విమర్శలకు ఇది మరింత బలాన్నిస్తుంది. తద్వారా పాక్ ప్రతిష్టకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఇజ్రాయెల్, భారత్ తదితర దేశాలు చేస్తున్న విమర్శలు, అమెరికా రక్షణ ఖర్చులు బయటపెట్టాలని డిమాండ్ చేయడం పాక్‌ను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. తాజాగా ఐరాసలో జరుగుతున్న చర్చలతో పాకిస్తాన్‌కు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పాక్‌లో ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలను మళ్లీ పునర్నిర్మిస్తున్నారు. అంతర్జాతీయంగా వచ్చిన వరద సాయాన్ని కూడా పాక్ ఉగ్ర కార్యకలాపాల కోసం వెచ్చించినట్లు ఆరోపణలున్నాయి. పాకిస్తాన్ ఇటీవల సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా రెండు దేశాలపై దాడిగా పరిగణిస్తారు. ఇది భారత్‌కు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. భవిష్యత్తులో పాక్‌తో సమస్య ఎదురైతే సౌదీతో కూడా పోరాడాల్సి రావొచ్చు. అలాంటి పరిస్థితులు రాకముందే, పాక్‌పై చర్చ జరుగుతున్నప్పుడే భారత నిఘా వర్గాలు మరిన్ని సాక్ష్యాలు సేకరించి అంతర్జాతీయ వేదికల్లో సమర్పిస్తే చర్యలకు అవకాశం ఉంటుంది. ఇది ఉగ్రవాదాన్ని అణిచివేయడంతో పాటు కశ్మీర్‌లో శాంతి ప్రక్రియకు దోహదపడుతుంది.
