Let's talk: editor@tmv.in
పాక్ ఆర్మీ, ఉగ్రవాద సంస్థల పొత్తు బహిర్గతం!

పాక్ ఆర్మీ, ఉగ్రవాద సంస్థల పొత్తు బహిర్గతం!

Venkatesh Balusula
18 సెప్టెంబర్, 2025

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" పాక్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలపై విధ్వంసకర ఎయిర్ స్ట్రైక్స్కు దారితీసింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా శిబిరాలపై దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు, టాప్ కమాండర్లు హతమయ్యారు. ముఖ్యంగా బహవల్పూర్లోని జైషే కార్యాలయంపై జరిగిన దాడిలో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు కూడా మరణించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జైషే మహ్మద్ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ చేసిన సంచలన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆదేశాల ప్రకారమే పాక్ ఆర్మీ అధికారులు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారన్నారు. అంతేకాకుండా ఉగ్రవాద శిబిరాలతో తమ సంబంధాలను మరుగున పెట్టేందుకు ప్రయత్నించినట్లు కూడా కాశ్మీరీ పేర్కొన్నారు.

కాశ్మీరీ వ్యాఖ్యలు పాకిస్థాన్ ప్రభుత్వ తీరుపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటి వరకు తమ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలే లేవన్నట్టు నాటకీయంగా స్పందించిన పాక్ ప్రభుత్వం, ఇప్పుడు జైషే కమాండర్ మాటలతో బిక్కుబిక్కుమంటోంది. భారత్ తరఫున "ఆపరేషన్ సిందూర్" ద్వారా ఉగ్ర మూలాలను ధ్వంసం చేయడం ఒక యుద్ధ వ్యూహాత్మక విజయం కాగా, ఆ దాడుల్లో పాక్ సైన్యం ప్రతిస్పందించిన విధానం మాత్రం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా నిలుస్తోంది. పాక్ ఆర్మీ, ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాలు కొత్తవి కావు. కానీ ఈసారి నేరుగా కమాండర్ హోదాలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఆపరేషన్, అంత్యక్రియలు, అధికారుల పాత్ర వంటి అంశాలను బయట పెట్టడం, పాక్ దురుద్దేశాలను మరోసారి బట్టబయలు చేస్తోంది. ఇది ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థల ముందు పాక్ను ఇరుకునే పడేసే అంశం ఉంది. భారత్ ప్రభుత్వం ఈ ఆరోపణలను కేంద్రంగా చేసుకొని అంతర్జాతీయంగా పాక్పై ఒత్తిడి తెచ్చే అవకాశాన్ని వినియోగించుకోవాలి.

పాక్ ఆర్మీ, ఉగ్రవాద సంస్థల పొత్తు బహిర్గతం! - Tholi Paluku