Let's talk: editor@tmv.in
పాక్ ఆటగాళ్లపై బీసీసీఐ ఫిర్యాదు

పాక్ ఆటగాళ్లపై బీసీసీఐ ఫిర్యాదు

Shaik Mohammad Shaffee
26 సెప్టెంబర్, 2025

ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్‌లో రెచ్చగొట్టేలా హావభావాలు ప్రదర్శించిన పాకిస్థాన్‌ ఆటగాళ్లు హరీస్ రవూఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్‌లపై ఇప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఆటగాళ్లపై భారత క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ఇదీ జరిగింది

సెప్టెంబర్ 21న దుబాయ్‌లో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత తన బ్యాట్‌ను గన్‌లాగా పట్టుకుని కాల్చినట్లుగా సంజ్ఞ చేశాడు. అలాగే హరీస్ రవూఫ్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ‘జెట్‌ ఫ్లైట్‌’లు కూలిపోయినట్లుగా 6-0 అని సంజ్ఞ చూపించాడు. ఆపరేషన్ సిందూర్‌ సమయంలో భారత్‌కు చెందిన ఆరు ఫైటర్ జెట్లను తమ సైన్యం కూల్చేసిందని పాక్‌ ఆరోపించింది. దానిని గుర్తు చేసేలా హారిస్‌ ఈ సైగ చేసినట్లు ప్రధాన విమర్శ. అదీగాక భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌తోనూ వాగ్వాదానికీ దిగాడు. దీంతో ఈ రెచ్చగొట్టే చేష్టలపై బీసీసీఐ ఫిర్యాదు చేయగా ఐసీసీ స్వీకరించింది. ఫర్హాన్, రవూఫ్ తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తే, ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ఎదుట వారు విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

సూర్యకుమార్‌పై పీసీబీ ఫిర్యాదు

బీసీసీఐ ఫిర్యాదుకు ప్రతిగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్‌లో గెలిచిన తర్వాత సూర్యకుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ ఫిర్యాదుకు కారణం. సూర్య తమ జట్టు విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు, భారత సాయుధ దళాలకు అంకితమిచ్చాడు. ఇప్పుడు అదే పాక్‌ కడుపు మంటకు కారణమైంది. సూర్యకుమార్ వ్యాఖ్యలు రాజకీయ స్వభావాన్ని కలిగి ఉన్నాయని, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పీసీబీ ఆరోపించింది.

ఏసీసీ ఛైర్మన్ వివాదాస్పద పోస్ట్

ఈ వివాదానికి ఆజ్యం పోస్తూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వి (ఈయన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ కూడా) 'ఎక్స్'లో చేసిన పోస్ట్ మరింత దుమారం రేపింది. నఖ్వి, ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో విమానం కూలిపోయినట్లు సూచించే సంజ్ఞ చేస్తున్న స్లో-మోషన్ వీడియోను పోస్ట్ చేశారు. ఇది రవూఫ్ చేసిన చేష్టకు మద్దతుగా, భారత్‌ను ఉద్దేశించి చేసినట్లుగా భావిస్తున్నారు. నఖ్వి చేసిన ఈ పోస్ట్ భారత్‌కు వ్యతిరేకంగా ఉండటం వలన, ఆసియా కప్ ఫైనల్‌కి చేరుకున్న భారత జట్టు, ఏసీసీ ఛైర్మన్‌తో వేదిక పంచుకుంటుందా? లేదా? అనేది చూడాలి. ఈ ఫిర్యాదులు, ప్రతి ఫిర్యాదులతో భారత్-పాక్ క్రికెట్ వైరం మైదానం దాటి అంతర్జాతీయ క్రికెట్ వేదికపై చర్చనీయాంశంగా మారింది. ఐసీసీ ఈ వ్యవహారాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

పాక్ ఆటగాళ్లపై బీసీసీఐ ఫిర్యాదు - Tholi Paluku