Let's talk: editor@tmv.in
పక్షుల జాతులు అంతరించిపోతున్నాయా?

పక్షుల జాతులు అంతరించిపోతున్నాయా?

Dr.Chokka Lingam
8 నవంబర్, 2025

ఒక్కసారి ఊహించండి... ఉదయం నిద్రలేచే సరికి కిటికీ బయట నుంచి వినిపించే పక్షుల కిలకిలారావం లేకపోతే ఎలా ఉంటుందో. చెట్ల మీద పచ్చగా ఎగిరే చిలుకలు, ఆకాశంలో వలయాలు వేసే పావురాలు, మన హృదయానికి ఆనందం ఇచ్చే ఆ చిన్న చిన్న స్వరాలు ఒక్కసారిగా మౌనం అయిపోతే మన జీవితం ఎంత ఖాళీగా అనిపిస్తుందో కదా. కానీ మీకోక విషయం తెలియాలి. ఇప్పటికే ఆ మౌనం మొదలైంది. మన ట్రాపికల్ ప్రాంతాల్లో, అంటే ఉష్ణమండల ప్రాంతాల్లో ఉన్న పక్షులు భయంకరంగా తగ్గిపోతున్నాయని తాజాగా వచ్చిన ఒక పెద్ద అధ్యయనం చెబుతోంది. కారణం ఏంటంటే, రోజు రోజుకి పెరుగుతున్న ఉక్కపోత వేడి. 1980ల నుంచి ఇప్పటి వరకు ఈ పక్షుల సంఖ్యలో మూడో వంతుకి పైగా తగ్గుదల కనిపించింది. కొన్ని జాతులు అయితే సగానికి మించి అంతరించిపోతున్నాయి.

మనకు ఒక రోజు 45 డిగ్రీల వేడిలో జీవించడం ఎంత కష్టమో మీరే ఊహించుకోండి. నీరు దొరకకపోతే మనం కూడా తట్టుకోలేము. కానీ ఆ పక్షుల పరిస్థితి ఇంకా దారుణం. వీటికి ఆహారం దొరకదు, నీరు దొరకదు, శ్వాస కూడా సరిగా తీసుకోలేవు. ఒకే ఒక్క వేడి గాలి తరంగం వందల సంఖ్యలో చిన్న జీవాలను ముంచెత్తేస్తుంది. ఇది కేవలం పక్షుల సమస్య కాదు. పక్షులు లేవంటే ప్రకృతిలో సమతౌల్యం దెబ్బతింటుంది. చెట్ల గింజలు వ్యాప్తి కావు, పూలు తగ్గిపోతాయ్, అడవుల జీవితం క్రమంగా ఖాళీ అవుతుంది. చివరికి మనిషి జీవితం కూడా ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే పక్షులు లేని ప్రపంచం అంటే మన భవిష్యత్తు లేని ప్రపంచం.

'ఇప్పటికైనా మారండి' అని ఒక గట్టి హెచ్చరిక ప్రకృతి మనకు చెబుతోంది. మనం ఉపయోగించే ప్రతి ఇంధన బిందువు, మనం కాపాడే ప్రతి చెట్టు, మనం ఆదా చేసే ప్రతి నీటి చుక్క.. ఇవన్నీ ఈ చిన్న చిన్న పక్షుల ప్రాణాలకు బలమైన ఆసరా అవుతాయి. ఒకసారి మనం కళ్ళు మూసుకుని ఆలోచిద్దాం.. మన పిల్లలు పెరిగే సమయానికి, పక్షుల పాటలు కేవలం పుస్తకాలలో మాత్రమే మిగిలిపోతే? ఆ గాలి నిండిన స్వరాలు కేవలం జ్ఞాపకాల్లో మాత్రమే వినిపిస్తే? మనం ఈ రోజు తీసుకునే నిర్ణయమే ఆ భవిష్యత్తును మార్చగలదు. పక్షులను కాపాడటం అంటే ప్రకృతిని కాపాడటం. ప్రకృతిని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటం.