
పాకిస్థాన్ సొంత ఇంటిలా ఉంది
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడాకు కొత్త కాదు. గతంలో ఆయన అనేక సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా, వివాదాస్పదంగా మారాయి. అయినప్పటికీ ఆయన తన తీరు మార్చుకోవడం లేదు. తాజాగా మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేసి వివాదంలో చిక్కుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సైతం నష్టం తెచ్చి పెట్టారు. పాకిస్థాన్‌లో ఉంటే తనకు సొంత ఇంట్లో ఉన్నట్టే అనిపించిందని కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ‘పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లో తనకు విదేశంలో లేకుండా, సొంత ఇంట్లోనే ఉన్నట్టు అనిపించింది’ అంటూ శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యానించడం గమనార్హం. కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగం చైర్మన్‌గా ఉన్న పిట్రోడా, ఐఏఎన్ఎస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, భారత్ విదేశాంగ విధానంలో పొరుగు దేశాలపై ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. "నేను పాకిస్తాన్‌కు వెళ్లాను.. అక్కడి ప్రజలు, సంస్కృతి చూస్తే సొంత ఇంట్లోనే ఉన్నట్టు అనిపించింది. బంగ్లాదేశ్, నేపాల్‌లో కూడా అలాగే ఫీలింగ్ వచ్చింది" అని ఆయన చెప్పారు. ఈ దేశాలతో స్నేహ సంబంధాలు బలోపేతం చేసుకుంటే భారత్ పొరుగు భద్రత పెరుగుతుందని, ఆర్థిక, సాంస్కృతిక సహకారం పెంచాలని పిట్రోడా సలహా ఇచ్చారు.
తీవ్రంగా విమర్శిస్తున్న బీజేపీ నేతలు
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా ప్రతిస్పందించారు. 26/11 ముంబై దాడుల తర్వాత కూడా యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోలేదని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ పాక్ అనుకూల వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. పిట్రోడా చేస్తున్న వ్యాఖ్యలు దేశ వైఖరికి భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ మీద ప్రేమ కనబరచాలా? అంటూ ఆయన ప్రశ్నించారు.
శ్యామ్ పిట్రోడా ఇంకా ఏమన్నారు?
పాకిస్తాన్‌తో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించవచ్చు. పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ లో భారతమూలాలు ఉన్నాయి. ఆ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. అంటూ పిట్రోడా వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత, నేపాల్‌లో అంతర్గత సమస్యలు ఉన్నప్పటికీ, భారత్ ఈ దేశాలతో సాంస్కృతిక, ఆర్థిక బంధాలు బలపరచాలని సూచించారు. ఈ మాటలు రాహుల్ గాంధీ విదేశ ప్రయాణాల సందర్భంగా వచ్చాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై అటు ట్విట్టర్‌లోనూ బీజేపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. "పుల్వామా, ఉరి దాడుల తర్వాత కూడా వారు మౌనంగా ఉండిపోయారు" అంటూ ఎక్స్ లో "పాక్ టెర్రరిస్టులు భారత్‌ను రక్తపు సముద్రంగా మార్చినా, కాంగ్రెస్ ప్రేమ ఆగదు" అని ఒక బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పదా?
కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికే దేశ వ్యతిరేక ముద్ర పడుతోంది. ఆ పార్టీ పాకిస్థాన్ కు అనుకూలంగా వ్యవహరిస్తుందని.. ఆపరేషన్ సింధూర్ ను కూడా అవమానిస్తూ మాట్లాడిందని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మరి ఆయన చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీకి ఎంతమేరకు నష్టం చేకూరుస్తాయో వేచి చూడాలి.
