
పండుగల సంప్రదాయం: ఆధునిక నాగరికత
భారతదేశంలో పండుగలు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఏక కాలంలో వందలాది రంగుల కాంతులతో మెరిసే దేశం ప్రపంచ పటంలో మరెక్కడైనా వుంటుందా . ఉత్తర భారతంలో దసరా, దీపావళి, హోలీ, దుర్గా పూజలు జరుపుకుంటుంటే, దక్షిణంలో సంక్రాంతి, పొంగల్, ఉగాది, ఓనాం ప్రజల హృదయాలను రంజింపజేస్తున్నాయి . పశ్చిమ బెంగాల్ లో గణేశ్ చతుర్థి, గుజరాత్లో నవరాత్రి వేడుకలు, తూర్పుతీరాన జగన్నాదుని రథయాత్ర , వాయువ్య భారతంలో బీహు, మధ్యభారతంలో గౌరీ పూజలు- ప్రతీ ప్రాంతం తనదైన సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తూ దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటుతూనే ఉంటున్నాయి.
మతపరంగా చూస్తే హిందువుల పండుగలతో పాటు మిగతా మతాల ఆచారాలైన ఈద్, బక్రీద్, రంజాన్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, గురుపురబ్, మహావీర్ జయంతి, బుద్ధ పూర్ణిమ, లాహోరి వంటి పండుగలు కూడా విశేష ఆదరణ పొందుతున్నాయి. ఈ విభిన్నతే భారతదేశ బహుళత్వాన్ని సజీవంగా భిన్నత్వం లో ఏకత్వం గా ఉంచుతోంది. ఈ పండుగలు కేవలం మతాచారాలు మాత్రమే కాకుండా సామాజిక ఐక్యత, కుటుంబ బంధాలను బలోపేతం చేసే క్షణాలుగా మారతాయి. దసరా బొమ్మల కొలువలు, దీపావళి దీపాల కాంతులు, ఈద్ విందులు, క్రిస్మస్ వేడుకలు ఇవి అన్నీ మనసును కొత్త ఉత్సాహంతో నింపుతాయి. పండుగల వల్ల చిన్న వ్యాపారులకు ఆర్థిక స్వావలంబనతో పాటు హస్తకళలు, బొమ్మలు, మిఠాయిలు, వస్త్రాలు, పూలు, పటాకులు అన్నీ పెద్ద ఎత్తున తయారీ రంగానికి చేయూతనిస్తున్నాయి. గ్రామీణ శిల్పులకు, మట్టి విగ్రహ తయారీదారులకు, చిన్నపాటి వ్యాపారులకు ఈ పండుగ రోజులు జీవనాధారంగా మారుతున్నాయి . పర్యాటక రంగం కూడా పండుగల సమయంలో విస్తారంగా లాభపడుతుంది.
పర్యావరణంపై విసురుతున్న సవాళ్ళు
ఈ సాంస్కృతిక ఉత్సవాలు ఆధునిక పాలనలో కఠిన సవాళ్లు విసురుతున్నాయి. భారీ రద్దీ, రోడ్డు జాములు, వ్యర్థాల పెరుగుదల, విద్యుత్ వినియోగం, అగ్ని ప్రమాదాలు, శబ్ద కాలుష్యం, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ నగర పరిపాలనను పరీక్షిస్తున్నాయి. గణేశ్ చతుర్థి నిమజ్జనాల సమయంలో ముంబై, హైదరాబాద్ లో రాత్రి మొత్తం వంతెనలు, రహదారులు మూసివేయాల్సి వస్తుంది. విగ్రహాలలో వాడే రసాయన రంగులు,ప్లాస్టఫ్ పారిస్ వంటివి నదులను కాలుష్యం చేస్తున్నాయి. దుర్గాపూజలో పెద్ద విగ్రహాల నిమజ్జనంతో గంగా,గోదావరి,హూగ్లీ వంటి నదుల జీవ వ్యవస్థలు దెబ్బతింటాయి. దీపావళి సమయంలో పటాకుల శబ్దం, పొగ సహజ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది.
ముస్లిం పండుగలలో ఈద్, బక్రీద్ వంటి వేళల్లో పెద్ద మసీదుల వద్ద భారీ ఎత్తున ప్రార్థనలు జరుగుతాయి. ఈ వేడుకలు జరిగే రోజుల్లో మసీదు పరిసర ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ, రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణ అవసరం. కొన్నిసార్లు జంతు బలి అంశంపై పర్యావరణవాదులు, జంతు ప్రేమికులు, కార్యకర్తలు వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. క్రిస్మస్ సమయంలో పర్యాటకుల రద్దీ గోవా, కేరళ, సిమ్లా వంటి ప్రాంతాల్లో స్థానిక మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని పెంచుతుంది. అర్ధరాత్రి ప్రార్థనలు, సంగీత కార్యక్రమాలు శబ్ద స్థాయిని పెంచి పొరుగు నిర్వాసితులకు ఇబ్బందులు కలిగిస్తాయి. విస్తారంగా వాడే అలంకరణ లైట్లు విద్యుత్ వినియోగాన్ని పెంచుతాయి. భూమి వేడెక్కేలా చేస్తాయి. క్రిస్మస్ తర్వాత ప్లాస్టిక్ అలంకరణలు, సింథటిక్ గిఫ్ట్ కవర్లు, కృత్రిమ చెట్ల తొలగింపు వ్యర్థ నిర్వహణకు సమస్యగా మారుతున్నాయి .
ఇక ఉత్తర భారతంలో కుంభమేళా వంటి సాంప్రదాయ పుణ్యస్నానాలకు కోట్లాది భక్తులు ఒకేచోట చేరుతారు. తాత్కాలిక నివాసాలు, తాగునీరు, పారిశుధ్యం, ఆరోగ్య సేవలు అందించటం అక్కడి ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా పరిణమిస్తుంది. గోవా కార్నివాల్, కేరళ ఓనాం, తెలంగాణ బోనాలు, మహారాష్ట్రలో దసరా ఊరేగింపులు ఇలా ప్రతీ చోట సమర్థవంతమైన ప్రణాళిక లేకుండా ఉత్సవాలు జరిగితే రవాణా, భద్రత, పర్యావరణం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ పండుగలు వేడుకలు మాత్రం మనకి అపారమైన ఆనందాన్ని తెచ్చి పెడతాయి.అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు సీజనల్ ఉత్సాహాన్ని ఇస్తాయి. పర్యాటక రంగం, హోటళ్లు, రవాణా, ఆన్లైన్ మార్కెట్లు, స్థానిక కళలు జోరు అందుకుంటాయి. సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, వంటకాలు, వస్త్రాలు తరతరాల సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. మతాంతర ఐక్యతను పెంపొందించటంలో పండుగలకు ప్రత్యేక పాత్ర ఉంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు పరస్పరం ఒకరి ఇంటికి ఒకరు వెళ్తూ బహుమతులు పంచుకోవడం శుభాకాంక్షలు తెలియజేసుకోవడం దేశ బహుళ సాంస్కృతిక సౌభ్రాతృత్వాన్ని బలపరుస్తున్నాయి.
తీవ్రమైన ప్రతికూలతలు
కానీ పండుగల వెనుక వున్న ప్రతికూలతలను విస్మరించరాదు. గాలి, శబ్ద కాలుష్యం, వ్యర్థాల తొలగింపు, విద్యుత్ అధిక వినియోగం, జంతు సంక్షేమ సమస్యలు, రోడ్లు రద్దీ, అత్యవసర సేవలకు అడ్డంకులు. ఇవి పౌర ఆరోగ్యానికి, పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాయి. కొన్నిసార్లు రాజకీయ పార్టీలు పండుగలను తమ ఓటు బ్యాంకు కోసం వినియోగించడం కూడా సమాజంలో విభజనకు దారితీస్తుంది.
సరైన పరిష్కారాల దిశగా.. స్మార్ట్ థింకింగ్
వీటి పరిష్కారం కఠిన నిషేధాల వల్ల జరగదు. స్మార్ట్ (తెలివైన,ప్రణాళికా బద్దమైన) పాలనలో ఉంది. పండుగల సమయాల్లో ముంబై, హైదరాబాద్ తదితర నగరాలలో డిజిటల్ క్రౌడ్ మానిటరింగ్ ను దశలవారీ నిమజ్జన షెడ్యూల్ ను అమలు చేస్తున్నారు. కేరళ త్రిస్సూర్ పురంలో తక్కువ శబ్ద పటాకులు వాడుతున్నారు. గోవా క్రిస్మస్ మార్కెట్ లలో ప్లాస్టిక్ వస్తువులను తగ్గించి పునర్వినియోగ పదార్థాలను ప్రోత్సహిస్తున్నారు. కొన్ని నగరాలు పండుగల సమయంలో అదనపు బస్సులు, మెట్రో రైళ్లు నడిపి నగరం లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తున్నాయి. భవిష్యత్తులో మత పెద్దలు, పౌర సంఘాలు, ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలి. మత పెద్దలు పర్యావరణ హిత పద్ధతులను ప్రజలకు తెలియజేయాలి. మున్సిపాలిటీలు ముందుగానే వ్యర్థాల నిర్వహణ, రవాణా, అత్యవసర వైద్య సేవల్లోసరైన పెట్టుబడులు పెట్టాలి. పౌరులు బయోడిగ్రేడబుల్ (నీటిలో సులువుగా కరిగే మట్టి విగ్రహాలు) పర్యావరణ హిత అలంకరణలు, తక్కువ విద్యుత్ దీపాలు వాడటంలో ముందుండాలి. పిల్లలకు పాఠశాలల్లోనే పండుగల విశిష్టత, పండుగల వాతావరణం తో పర్యావరణం పై పడే విషవాయువుల ప్రభావం,వారు తీసుకోవలసిన సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించాలి.
మతసామరస్యమే భారత్ కు నిజమైన శక్తి
భారతదేశపు బహుళ మతసామరస్యమే దాని లౌకిక వాదానికి ,సమగ్ర ప్రతిష్టకు నిజమైన శక్తి. ప్రతి దీపావళి దీపం, ఈద్ విందు, క్రిస్మస్ కీర్తన, గురుపురబ్ ఊరేగింపు భక్తితో పాటు బాధ్యతతో మెరవాలి. సంప్రదాయం మరియు ఆధునిక పాలన కలసి నడిస్తే పండుగలు ఆనందాన్ని ఆహ్లాదాన్ని మాత్రమే పంచుతాయి, సమస్యలను కాదు. పండుగల ఉత్సాహం పర్యావరణం, ఆరోగ్యం, శాంతి కాపాడే దిశగా మారితేనే భవిష్యత్తు తరాలు కూడా ఈ సంస్కృతి కాంతిని సమృద్ధిగా ఆస్వాదించగలవు. అదే భారత్ కు నిజమైన గుర్తింపు.
)
