Let's talk: editor@tmv.in
పండుగల వేళ పోస్టాఫీసుల్లో గంగాజలం.. రాఖీలకు ప్రత్యేక కవర్లు

పండుగల వేళ పోస్టాఫీసుల్లో గంగాజలం.. రాఖీలకు ప్రత్యేక కవర్లు

Gaddamidi Naveen
20 ఆగస్టు, 2026

పండుగల సీజన్ సంద‌ర్భంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ పోస్టల్ సర్కిల్ పలు ప్రత్యేక ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తెచ్చింది. శ్రావణ మాసం, రక్షాబంధన్ వేడుకల సందర్భంగా భక్తులు, వినియోగదారుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పోస్టల్ శాఖ అధికారులు వెల్లడించారు.

శ్రావణ మాసంలో ఇళ్లలో పూజలు నిర్వహించే భక్తుల కోసం గంగోత్రి నుంచి నేరుగా తెప్పించిన పవిత్ర గంగాజలాన్ని పోస్టాఫీసుల ద్వారా విక్రయిస్తున్నారు. 250 మి.లీ. గంగాజలం బాటిల్‌ను రూ. 30గా నిర్ణయించారు. ఈ బాటిళ్లు తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల ప్రధాన హెడ్ పోస్టాఫీసులతో పాటు ఎంపిక చేసిన పోస్టాఫీసులలో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, పోస్టల్ శాఖ అధికారిక ఈ-కామర్స్ పోర్టల్ ద్వారా కూడా వీటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చని తెలిపారు.

అదేవిధంగా రక్షాబంధన్ సందర్భంగా సోదర, సోదరీమణులకు రాఖీలు పంపేందుకు ప్రత్యేకంగా రూపొందించిన రాఖీ ఎన్వెలప్‌లను రూ.15కే అందిస్తున్నారు. రాఖీలను త్వరగా, సురక్షితంగా పంపేందుకు స్పీడ్ పోస్ట్ సేవలపై 10 శాతం డిస్కౌంట్‌ను కూడా ప్రకటించారు. పండుగల సమయంలో పోస్టల్ సేవలను మరింత సులభంగా ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ పోస్టల్ సర్కిల్ అధికారులు వెల్లడించారు. పండుగ వేళ బంధువులకు కానుకలు, రాఖీలు పంపేందుకు ప్రజలు తమ సమీపంలోని పోస్టాఫీసులను సందర్శించి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ శాఖ కోరింది.