
పండుగలు చెప్పే పాఠాలు – అవగాహన తోనే ఆనందం
భారతదేశంలో పండుగలు కేవలం ఆచారాలు కాదు అవి సమాజాన్ని కలిపే బంధాలు. దీపావళి, దసరా, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ ఏ పండుగ అయినా కుటుంబం, ఇరుగు పొరుగు, ఊరూ వాడా , మొత్తం ఒక చోట చేరే వేదికగా మారతాయి. ఒకప్పుడు పండుగ అంటే ఇల్లూ, వీధి, ఊరంతా శుభ్రం చేసుకోవడం , మామిడాకులు తోరణాలతో ఊరంతా అలంకరించడం, అందరూ కలిసి పండుగ చేసుకోవడం. ఇవి వ్యక్తుల మధ్య భేదాలను కరిగించి సామాజిక ఐక్యతను బలపరిచేవి. పట్టణ జీవనంలో కూడా, వేగంగా పరుగులు తీసే జీవనశైలికి కొంత విరామం ఇచ్చి, పండుగలు కుటుంబ బంధాలను పునరుద్ధరిస్తాయి. అసలు ఉత్సవాల తత్త్వం "సహజీవనం మరియు కృతజ్ఞత" అదే నేటి సమాజానికి అత్యవసరం.
రాజకీయ, సామాజిక పాత్ర
చరిత్రలో పండుగలు సామూహిక చైతన్యానికి కేంద్రాలుగా మారాయి. స్వాతంత్ర్య సమర కాలంలో మహాత్మా గాంధీ వంటి నేతలు హిందూ, ముస్లిం ఉత్సవాలను కలసి జరపమని పిలుపునిచ్చారు జాతీయ ఐక్యతకు సంకేతంగా. కానీ ఇటీవలి కాలంలో, కొన్ని పండుగలు రాజకీయ రంగు పులుముకున్నాయి. గట్టిగా నినాదాలు, చెవులు నొప్పెట్టే గోల, గొప్పలు చూపుకొనే ప్రదర్శనలు ఈ గోల భక్తిని మింగేసింది. కొన్ని సందర్భాల్లో మతపరమైన ఉత్సవాలు రాజకీయ ర్యాలీలుగా మారాయి. నిజమైన నాయకత్వం ప్రజలను విభజించడం కాదు, వారిని కలపడం. పండుగలు శాంతి, ఐక్యత, సామాజిక సేవకు వేదికలుగా మారాలి రాజకీయ ప్రదర్శనలకు కాదు.
పండుగలు వెనుక ఆర్థిక కోణం
పండుగలు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా పండుగే. పండుగలకు పూలు, పండ్లూ,పిండి వంటలూ, కొత్త బట్టలూ, దీపాలు, బహుమతులు అన్నీ విపరీతంగా అమ్ముడవుతాయి. గ్రామీణ హస్త కళాకారులు, రైతులు అందరికీ పని, ఆదాయం వచ్చేది. కానీ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో వాణిజ్యాధారిత ప్రదర్శన పెరిగిపోయింది. కృతజ్ఞతా భావం తగ్గిపోయి, పోటీ, విలాసం, వ్యర్థ ఖర్చు పెరిగింది. చైనీస్ లైట్లు, ప్లాస్టిక్ అలంకారాలు, రసాయన దీపాలు ఇవి పర్యావరణానికీ, స్థానిక వృత్తిదారులకీ నష్టం కలిగిస్తున్నాయి. అందుకే స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, పర్యావరణహిత అలంకరణలు, స్వదేశీ బహుమతులు వంటి మార్గాలు అత్యవసరం
సాంస్కృతిక, ఆధ్యాత్మిక సారం
ప్రతి పండుగ ప్రకృతి చక్రానికి అనుసంధానం కలిగి ఉంది. సంక్రాంతి పంటల పండుగ, హోలీ వసంత కాలానికి స్వాగతం, దీపావళి వెలుగు చీకటిపై విజయం ఇవన్నీ జీవన తత్త్వాన్ని ప్రతిబింబించాయి. ఈ ఆచారాల వెనుక లోతైన సూత్రాలు ఉన్నాయి ఇల్లు శుభ్రపరచడం అంటే మనసు శుద్ధి, దీపం వెలిగించడం అంటే ఆశా దీపం, భోజనం పంచుకోవడం అంటే సమానత్వం. అలా ఉత్సవాలు మనుషులలో నైతికత, భక్తి, సహజ ప్రేమను పెంచేవి. కానీ నేటి తరానికి ఈ ఆచారాల వెనుక ఉన్న సారాంశం – ఆనందం నుంచి అవగాహన దాకా
1. ఉత్సవాల సామాజిక ప్రాముఖ్యత
కానీ నేటి తరానికి ఈ ఆచారాల వెనుక ఉన్న తాత్పర్యం తెలియడం లేదు. పాఠశాలల్లో, కుటుంబాల్లో ఈ కథల్ని, పౌరాణిక అర్థాల్ని చెప్పడం ద్వారా మళ్లీ మన పండుగలు కొత్త పాతల మేలు కలయిక కావాలి
కాలక్రమంలో వచ్చిన వికృతులు
ఆధునిక కాలంలో జనసంఖ్యా పెరుగుదల, పట్టణీకరణ, వినియోగ సంస్కృతి ఇవన్నీ పండుగల స్వరూపాన్నే మార్చేశాయి. శబ్ద కాలుష్యం, గాలి కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్సవాల తర్వాత ఊరంతా చెత్త.
దీపావళి రోజుల్లో వాయు, శబ్ద కాలుష్యం.
గణేష్ నిమజ్జనంలో రసాయన విగ్రహాలతో నీటి కాలుష్యము .బక్రీద్ రోజుల్లో అంతులేని మూగ జీవాల వేదనలు. క్రిస్మస్ పేరిట బలవంతపు కానుకలు, హోలీలో సహజ రంగుల బదులు విషరసాయనాలు. దేవుని సృష్టిని సత్కరించాల్సిన రోజులు సృష్టినే నాశనం చేసే రోజులుగా మారిపోవడం విషాదకరం
కొత్తపాతల మేలు కలయిక అవసరం
పండుగలను ఆపడం పరిష్కారం కాదు వాటి వెనుక వున్న పరమార్థాన్ని అవగాహనతో పొందడం పరిష్కారం. మనకు కావలసింది ఉత్సవాల ఆనందాన్ని కొనసాగిస్తూ వాటిని సుస్థిరమైన రూపంలో మలచడం.
ఉదాహరణలు, సూచనలు:
దీపావళి గ్రీన్ క్రాకర్స్: సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు రూపొందించిన గ్రీన్ పటాకులు 30–40% తక్కువ కాలుష్యం కలిగిస్తాయి. ఇవి శాస్త్రం, సంప్రదాయం కలిసి సృష్టించిన కొత్త మార్గం.
పర్యావరణహిత గణేష్ విగ్రహాలు: మట్టితో చేసిన, లోపల విత్తనాలు ఉన్న విగ్రహాలు నిమజ్జనానంతరం మొక్కగా మారుతాయి.
సామూహిక ఉత్సవాలు: ఒక్కో వ్యక్తి శబ్దం చేయడం కంటే సామూహిక ప్రాంగణాల్లో సంయమనం పాటించి జరుపుకోవడం మంచి మార్గం.
డిజిటల్ అవగాహన: సోషల్ మీడియాలో విలాసాన్ని చూపించక, పర్యావరణ సందేశాలు, స్వదేశీ ఉత్పత్తుల ప్రచారం చేయాలి.
శిక్షణ వ్యవస్థ: విద్యార్థులకు ప్రతి పండుగ యొక్క తాత్పర్యం, పర్యావరణ ప్రభావం గురించి బోధించాలి. దీపావళి అంటే కాంతి, పొగ కాదు; హోలీ అంటే రంగులు, రసాయనాలు కాదు అనే అవగాహన అవసరం.
ఉత్సవాలు ఒక నాగరికతను ప్రతిబింబిస్తాయి. మన పండుగలు దేవుని పట్ల కృతజ్ఞత, అందరితో పంచుకోవడం, ప్రకృతిపట్ల గౌరవం అనే విలువలను మోసుకొచ్చాయి. ఈ ఆధ్యాత్మికతను ఆధునిక విజ్ఞానంతో కలిపితే పండుగలు మళ్లీ జగత్తుకూ, జీవునికీ, దేవునికీ చేరువవుతాయి.
