Let's talk: editor@tmv.in
పంట వ్యర్థాలను కాల్చొద్దు : ఏపీ వ్యవసాయ శాఖ

పంట వ్యర్థాలను కాల్చొద్దు : ఏపీ వ్యవసాయ శాఖ

Panthagani Anusha
10 డిసెంబర్, 2025

రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ వరి కోతలు జోరుగా సాగుతున్న తరుణంలో పంట వ్యర్దాలను పొలాల్లో తగులబెట్టే ఘటనలు గణనీయంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వరుసగా పెరుగుతున్న వాయుకాలుష్యం, నెలలో ఉండే సహజ పోషకాలు తగ్గిపోవడం నేపథ్యంలో రైతులు పంట వ్యర్థాలను కాల్చే పద్ధతిని పూర్తిగా మానుకోవాలని, అది పంట వ్యవస్థను బలహీనపరుస్తుంది వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జీలానీ సమున్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. గత రెండు వారాలుగా వరి కోతలు జరుగుతున్నప్పటికీ పలు మండలాల్లో రైతులు వరి గడ్డి, దుబ్బులను తగులబెట్టడం ఆందోళన కలిగిస్తోంది అని ఆలా చేయడం వల్ల మట్టి సారాన్ని తగ్గి తీవ్ర నష్టం కలగడంతో పాటు, పర్యావరణ కాలుష్యానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే పంట వ్యర్థాలను కాల్చడం వల్ల మట్టికి భారీ నష్టం కలుగుతుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ సమున్‌ హెచ్చరించారు. పంట వ్యర్థాలు తగుబెట్టినప్పుడు మట్టిలోని నత్రజని, ఫాస్పరస్‌, పొటాష్‌ వంటి కీలక పోషకాలు పూర్తిగా నశిస్తాయని తెలిపారు. దీంతో మట్టిసారం గణనీయంగా తగ్గిపోతుందని, భూమి ఉత్పాదకతపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన వివరించారు.

వ్యర్థాల దహనం వలన సాయిల్ ఆర్గానిక్ కార్బన్ స్థాయిలు పడిపోవడం మట్టి శక్తిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. కార్బన్ శాతం తగ్గిపోతే మట్టి నిర్మాణం బలహీనపడుతుందని, పంటలకు అవసరమైన పోషకాలు నిల్వ ఉండే సామర్థ్యం కూడా తగ్గిపోతుందని సమున్‌ వెల్లడించారు.

మట్టిలో సహజంగా ఉండే ప్రయోజనకర సూక్ష్మజీవులు దహనం కారణంగా పూర్తిగా నశిస్తాయని దీనివల్ల మట్టి జీవవైవిధ్యం దెబ్బతింటుందని అన్నారు. ఈ సూక్ష్మజీవులు లేకపోతే మట్టికి కావాల్సిన జీవ చైతన్యం తగ్గిపోతుంది, భూమి నాణ్యత క్రమంగా పడిపోతుంది. అదేవిధంగా మట్టిలోని తేమ నిలుపుదల శక్తిని దెబ్బతీస్తుంది. మట్టికి అవసరమైన తేమ నిలవకపోవడంతో పాటు ఆమ్లత్వం పెరిగిపోతుందని, ఇది పంటల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. అంతేకాక పంట వ్యర్థాలను దహనం చేసేటప్పుడు వచ్చే పొగలు, విషవాయువులు గాలిని కలుషితం చేసి ప్రజారోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తాయని హెచ్చరించారు.

అదేవిధంగా పంట వ్యర్దాలు మట్టిలో కలిపితే మట్టిసారం సహజంగా పెరుగుతుందని పంట వ్యర్దాలు మట్టిలో కలిసినప్పుడు అవసరమైన పోషకాలు తిరిగి భూమికి అందుతాయి అని పేర్కొన్నారు. సాయిల్ కార్బన్ శాతం పెరగడం వల్ల మట్టి నాణ్యత మెరుగుపడుతుంది. మట్టి నాణ్యత మెరుగుపడితే తదుపరి పంటలకు అధిక ఉత్పాదకత వస్తుందని ఆయన అన్నారు.

అదేవిధంగా పంట వ్యర్థాలను విలీనం చేసే పద్ధతులు వ్యవసాయాన్ని దీర్ఘకాలికంగా స్థిరంగా ఉంచడానికి చాలా కీలకమని సమున్‌ స్పష్టం చేశారు. ఈ శాస్త్రీయ పద్ధతులను రైతులు అనుసరిస్తే స్థిరమైన దిగుబడులు సాధ్యమవుతాయని ఆయన సూచించారు.

అయితే అన్ని జిల్లాల్లో రైతు సేవా కేంద్రాల సిబ్బంది, క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు వెంటనే గ్రామాలకు వెళ్లి రైతులకు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. పర్యావరణానుకూల పద్ధతులను ప్రోత్సహించి, రైతులు శాస్త్రీయ సూచనలను తప్పనిసరిగా పాటించేలా చూడాల్సిందిగా సూచించారు. మట్టిలోని సారాన్ని కాపాడుకోవడం భవిష్యత్తు వ్యవసాయానికి అత్యంత కీలకమని, రైతులు స్టబుల్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతులను ఆచరణలో పెట్టాలని సమున్‌ పునరుద్ఘాటించారు.