
పంజాబ్ రైతులకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రశంసలు
పంజాబ్ రైతులు వ్యవసాయంలో పాటిస్తున్న నైపుణ్యానికి, ప్రత్యేకించి మిగులు పంట వ్యర్థాల నిర్వహణలో సాధించిన విజయాలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసలు కురిపించారు. గురువారం ఆయన మొగ జిల్లా రన్సీహ్ కలాన్ గ్రామానికి వెళ్లి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి పంట పొలాల గురించి ముచ్చటించారు. స్థానిక గురుద్వారాలో ప్రార్థనలు చేసిన తర్వాత గ్రామ పంచాయతీ సభ్యులు, అధికారులు, రైతులతో కలిసి వ్యవసాయ పద్ధతులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంజాబ్ అద్భుతం. పంచాయతీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం కొత్త రికార్డులు సృష్టించింది. నేను మా ఇంటికే వచ్చినట్టు అనిపిస్తోంది అన్నారు. గ్రామస్తులతో కలిసి మంచంపై కూర్చొని భోజనం చేశారు. మక్కీ ద రొట్టి – సర్సో ద సాగ్ తిన్నాక హృదయం నిండిపోయింది అంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
6 సంవత్సరాలుగా పంట వ్యర్థాల కాల్చివేత లేదు
ఈ గ్రామంలో 6 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా వరి పొలాల చెత్తను కాల్చలేదని మంత్రి వెల్లడించారు. “ పంటవ్యర్థాలు (స్టబ్‌బుల్) కాల్చడం వల్ల మట్టిలోని సూక్ష్మజీవులు చనిపోతాయి. కాలుష్యం పెరుగుతుంది. కానీ ఇక్కడ రైతులు దాన్ని నేలలో కలిపి నేరుగా విత్తనాలు వేస్తున్నారు. ఇది దేశానికి ఆదర్శమన్నారు. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం పంజాబ్‌లో స్టబ్‌బుల్ బర్నింగ్ 83శాతం తగ్గిందని ఆయన పేర్కొన్నారు.
ఎరువులు తగ్గినా దిగుబడి తగ్గలేదు
గ్రామానికి చెందిన రైతు గోపాల్ సింగ్ మంత్రితో మాట్లాడుతూ ఎకరాకు 1½ సంచుల నుంచి 1 సంచికి డీఏపీని తగ్గించాను. అలాగే యూరియా కూడా 3 సంచుల నుంచి 2 సంచులకు తగ్గించానని తెలిపారు. ఇంతగా ఎరువుల వాడకాన్ని తగ్గించినా దిగుబడిపై ఎటువంటి ప్రభావం లేదని వివరించారు. దీంతో మంత్రి ఆయనను అభినందించారు.
దేశ రైతులకు మంత్రి చౌహాన్ ఇచ్చిన సూచనలు
• కృత్రిమ ఎరువులు, డీజిల్ వినియోగాన్ని తగ్గించండి
• స్టబ్‌బుల్ బర్నింగ్‌కి చెక్ పెట్టండి
• హ్యాపీ సీడర్ వాడితే నీటి వినియోగం తగ్గి, మొక్కజొన్న మొలకలు అడ్డంకులు లేక పెరుగుతాయి
• నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది
ఉత్పాదకత తగ్గకుండా, సుస్థిర వ్యవసాయం సాధ్యమని పంజాబ్ రైతులు నిరూపించారు. ఇక్కడి సందేశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలనుకుంటున్నాను అని చౌహాన్ అన్నారు.
