Let's talk: editor@tmv.in
పంజాబ్ రైతులకు అండగా ఉంటాం: సీఎం యోగి

పంజాబ్ రైతులకు అండగా ఉంటాం: సీఎం యోగి

Pinjari Chand
22 అక్టోబర్, 2025

పంజాబ్ రైతులకు అండగా ఉంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పంజాబ్‌లో ఇటీవల వచ్చిన వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆ రాష్ట్రానికి 1,000 క్వింటాళ్ల గోధుమ విత్తనాలు పంపిస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం తెలిపారు. లక్నోలో జరిగిన విత్తన సాయం వాహనాల పంపిణీ కార్యక్రమంలో సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంజాబ్‌లోని వరదలు ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చాయని, విత్తన నిల్వలను తీవ్రంగా ప్రభావితం చేశాయని విచారం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో పంజాబ్ రైతులకు అండగా మేం ఉంటాం. వారికి మద్దతుగా నిలబడతామన్నారు. ఈ రోజు వారికి గోధుమ విత్తనాలు పంపిస్తున్నాం. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ, విత్తన అభివృద్ధి సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు. సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పనితీరును కూడా ఆయన ప్రశంసించారు. మేం అధికారంలోకి రాకముందు ఈ శాఖ అధ్వాన దుస్థితిలో ఉండేది. ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తోందని ప్రశంసించారు. ఈ గోధుమ విత్తనాలు నాటిన 155 రోజుల్లో పంట వస్తోంది. ప్రతి హెక్టారుకు 80 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. ఇది అత్యుత్తమ రకమైన గోధుమ విత్తనం అని సీఎం యోగి వివరించారు.

గతంలో కూడా ఇతర రాష్ట్రాలకు సహాయం

గతంలో పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో వచ్చిన వరదల సమయంలో కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహాయక సామగ్రి పంపిందని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించిందని సీఎం గుర్తు చేశారు. ఈసారి పంజాబ్ రైతులకు ఈ క్లిష్ట సమయంలో వేయి క్వింటాళ్ల విత్తనాలను పంపించడం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ దీపావళితో బాటు హర్విందర్ సాహిబ్ గోవింద్ జయంతి కూడా ఒకేరోజు వచ్చాయని తెలిపారు. ఆయన ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారని. ఆయన పంజాబ్ ను సందర్శించినప్పుడు ప్రజలు దీపాలు వెలిగించారని సీఎం గుర్తు చేశారు.

పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం పునరావాస బిల్లుపై చర్చ కొనసాగుతోందని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్ పాల్ సింగ్ చీమా అన్నారు. పంజాబ్ ప్రభుత్వం వరద నష్టాలకు పరిహారంగా రూ. 20,000 కోట్లు కేంద్రాన్ని కోరిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ. 1,600 కోట్లు మాత్రమే ప్రకటించారని, అవి కూడా ఇంకా విడుదల కాలేదని ఆయన వాపోయారు.

పంజాబ్ రైతులకు అండగా ఉంటాం: సీఎం యోగి - Tholi Paluku