
పంజాబ్ రాజకీయాల్లో కలకలం.. అధికారి ఆత్మహత్య కేసులో మంత్రి రాజీనామా
పంజాబ్‌లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో మాజీ మంత్రి లల్జిత్ సింగ్ భుల్లర్, ఆయన తండ్రి సుఖ్‌దేవ్ సింగ్ భుల్లర్, వ్యక్తిగత సహాయకుడు దిల్బాగ్ సింగ్‌లపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. అమృత్‌సర్‌లోని పంజాబ్ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ గగన్‌దీప్ సింగ్ రంధావా శనివారం విషపదార్థం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రంధావా భార్య ఉపిందర్ కౌర్ ఫిర్యాదు మేరకు అమృత్‌సర్‌లోని రంజిత్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని ఆత్మహత్యకు ప్రేరేపించడం, బెదిరింపులు, ఉద్దేశపూర్వక కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.
వీడియోలో సంచలన ఆరోపణలు
ఈ ఘటనకు ముందు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. అందులో రంధావా ‘మాజీ మంత్రి భుల్లర్ భయంతో సెల్ఫోస్ తాగాను... ఇక నేను బతకనని చెప్పినట్లు వినిపించింది. అయితే ఈ ఆరోపణలను భుల్లర్ పూర్తిగా ఖండిస్తూ, అవి నిరాధారమని పేర్కొన్నారు.
టెండర్ వ్యవహారంపై ఒత్తిళ్లు?
ఎఫ్‌ఐఆర్ ప్రకారం, గిడ్డంగుల నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ను తన తండ్రికి కేటాయించాలంటూ భుల్లర్ తరచూ ఒత్తిడి తెచ్చారని రంధావా భార్య ఆరోపించారు. టెండర్ రద్దు చేసి మళ్లీ తన తండ్రి పేరుతో ఇవ్వాలని బెదిరింపులు చేశారని, వాట్సాప్ కాల్స్ ద్వారా మానసికంగా హింసించి, బెదిరించారని తెలిపారు. మార్చి 13న పత్తి నివాసానికి పిలిపించి అవమానించడం, దాడి చేయడం, అలాగే రంధావాను గన్‌పాయింట్ వద్ద రూ.10 లక్షలు లంచం తీసుకున్నట్లు ఒప్పించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఒత్తిళ్ల వల్ల తీవ్ర మానసిక వేదనకు గురైన రంధావా చివరకు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఆమె తెలిపారు.
చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి భగవంత్ మాన్, నిష్పక్షపాత విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆరోపణల నేపథ్యంలో భుల్లర్‌ను మంత్రివర్గం నుంచి రాజీనామా చేయాలని సూచించగా, ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. భుల్లర్ నిర్వహిస్తున్న రవాణా, జైలు శాఖలను ఇతర మంత్రులకు కేటాయించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ప్రతిపక్ష పార్టీలు ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. భుల్లర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. టెండర్ వ్యవహారంలో ఒత్తిళ్లు, బెదిరింపుల ఆరోపణల మధ్య జరిగిన ఈ ఆత్మహత్య కేసు పంజాబ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతోంది. విచారణ ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై అందరి దృష్టి నిలిచింది.
