Let's talk: editor@tmv.in
పంజాబ్ కాంగ్రెస్‌లో కలకలం: నవజోత్ కౌర్ సిద్ధూ సస్పెన్షన్

పంజాబ్ కాంగ్రెస్‌లో కలకలం: నవజోత్ కౌర్ సిద్ధూ సస్పెన్షన్

Pinjari Chand
9 డిసెంబర్, 2025

పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ చేసిన ‘రూ.500 కోట్లు ఇస్తేనే ముఖ్యమంత్రి కుర్చీ’ వ్యాఖ్యల కారణంగా, పార్టీకి చెందిన నేత,పంజాబ్ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ భార్య అయిన నవజోత్‌ కౌర్‌ సిద్ధూను సోమవారం సాయంత్రం ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్‌ చేసినట్లు పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అమరిందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌ ప్రకటించారు. శనివారం కౌర్ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఇలా అన్నారు ‘రూ.500 కోట్ల సూట్‌కేస్‌ ఇచ్చినవాడే ముఖ్యమంత్రి అవుతారు. మేం డబ్బు ఇవ్వలేం. కానీ పంజాబ్‌ను బంగారు రాష్ట్రంగా మార్చగలం అని వ్యాఖ్యానించారు. పంజాబ్‌, పంజాబీయత్‌ కోసమే మేం మాట్లాడుతుంటాం. కానీ సీఎం కుర్చీ కోసం ఇవ్వడానికి మాకు రూ.500 కోట్లు లేవు అని తెలిపారు. ఏ పార్టీయైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన భర్తను ప్రకటిస్తే ఆ పార్టీలో చేరతామని, నవజోత్‌ సింగ్‌ సిద్ధూ తిరిగి చురుకుగా రాజకీయాల్లోకి వస్తారని ఆమె చెప్పారు.

చెలరేగిన దుమారం

ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి. బీజేపీ, ఆప్‌ పార్టీలు కాంగ్రెస్‌లో సూట్ కేసు రాజకీయాలు వెలుగులోకి వచ్చాయని విమర్శించాయి. దీనిపై కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా స్పందించి ఆమెను సస్పెండ్‌ చేసింది.

నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు

ప్రతిపక్షాల విమర్శల తర్వాత ఆమె మళ్లీ సోషల్ మీడియాలో కాంగ్రెస్‌ మమ్మల్ని ఎప్పుడూ డబ్బు అడగలేదు. నా వ్యాఖ్యకు తప్పు అర్ధం చెప్పారు. మా వద్ద డబ్బు లేదని మాత్రమే చెప్పాను’ అని నవజోత్‌ కౌర్‌ చెప్పారు.

నవజోత్‌ కౌర్‌ సిద్దూ ‘మెంటల్ హాస్పిటల్‌’లో చేరాలి: డీకే శివకుమార్

రూ.500 కోట్లు ఇస్తేనే ముఖ్యమంత్రిగా అవ్వొచ్చు అనే వ్యాఖ్య చేసిన పంజాబ్ కాంగ్రెస్‌ నాయకురాలు నవజోత్‌ కౌర్‌ సిద్ధూ మానసిక ఆసుపత్రిలో చేరాలని సూచిస్తూ కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఒక మంచి మెంటల్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్లి చేర్పించండి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో 2027 ఎన్నికల నేపథ్యంలో తన భర్తను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే రాజకీయాల్లోకి తిరిగి వస్తారని నవజోత్‌ కౌర్‌ తెలిపారు. అలాగే తమ వద్ద రూ.500 కోట్లు లేవని, పంజాబ్‌కు సేవ చేయడమే తమ లక్ష్యమని అన్నారు.

పంజాబ్ కాంగ్రెస్‌లో కలకలం: నవజోత్ కౌర్ సిద్ధూ సస్పెన్షన్ - Tholi Paluku