Let's talk: editor@tmv.in
పంజాబ్‌లో ప్రతి ఇంటికీ ‘ఆరోగ్య ధీమా’

పంజాబ్‌లో ప్రతి ఇంటికీ ‘ఆరోగ్య ధీమా’

Pinjari Chand
28 డిసెంబర్, 2025

పంజాబ్ ప్రభుత్వం రాబోయే నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు నూతన కానుక ఇవ్వనుంది. జనవరి 2026 నుంచి ప్రతీ కుటుంబానికి ఊరటనిచ్చే ఆరోగ్య బీమా నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.10లక్షల వరకు పూర్తిగా క్యాష్‌లెస్, పేపర్‌లెస్ వైద్య సేవలు అందించే తాజా ‘ముఖ్యమంత్రి సేహత్ యోజన’ ద్వారా పేదల నుంచి మధ్యతరగతి వరకు ఉన్న ప్రతి నివాసి కుటుంబం ప్రాణాంతకమైన చికిత్సలను ఆర్థిక భారం లేకుండా పొందగలుగుతారు. ఇది భారత రాష్ట్రాల్లో తెలంగాణతో బాటు అత్యధికంగా వాల్యూ హెల్త్ కవరేజ్‌ని అందించే కార్యక్రమంగా ఉండనుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద ఊరటనిస్తూ ‘ముఖ్యమంత్రి సేహత్ యోజన కింద అందించే ఆరోగ్య బీమా పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఈ పథకం 2026 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సహా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

పథకం ముఖ్యాంశాలు

బీమా కవరేజ్: ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.10 లక్షలు

లబ్ధిదారులు: పంజాబ్‌లో నివసించే ప్రతి కుటుంబం

కవర్ అయ్యే చికిత్సలు: ప్రధాన రోగాల చికిత్స, శస్త్రచికిత్సలు (ఆపరేషన్లు), ఐసీయూ చికిత్స, ఆసుపత్రి ఖర్చులు, ఆధునిక వైద్య సేవలు

ఆసుపత్రులు: ప్రభుత్వ ఆసుపత్రులు, పంజాబ్, చండీగఢ్‌లోని ఎంపానెల్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు

చికిత్స విధానం: పూర్తిగా క్యాష్‌లెస్, పేపర్‌లెస్

నమోదు విధానం: ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ ద్వారా సులభ నమోదు

ప్రభుత్వ అభిప్రాయం

ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ, డబ్బుల లేకపోవడం వల్ల ఎవ్వరూ చికిత్సకు దూరం కాకూడదు అనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సార్వత్రిక ఆరోగ్య భద్రతే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.

ఆర్థిక భారం పెరుగుతోంది

ఈ నిర్ణయంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా భావిస్తున్నారు. అయితే కొందరు విమర్శకులు అవసరం లేని వర్గాలకు కూడా పథకం వర్తింపజేయడం వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పెరుగుతుందని, దీర్ఘకాలిక నిర్వహణపై కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం, సకాలంలో చికిత్స అందితే భవిష్యత్తులో వైద్య ఖర్చులు తగ్గుతాయని, ప్రజారోగ్యం మెరుగుపడుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నిర్ణయంతో పంజాబ్ రాష్ట్రం దేశంలోనే ప్రతి కుటుంబానికి అధిక విలువైన సార్వత్రిక ఆరోగ్య బీమా అందించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ సరసన నిలిచింది.

నిధుల కేటాయింపు

పంజాబ్ ప్రభుత్వం 10 లక్షల ఆరోగ్య కవరేజ్ పథకం కోసం ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. 2025-26 వార్షిక బడ్జెట్‌లో పంజాబ్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా పథకానికి మొత్తం సుమారు రూ.778 కోట్లు ఖర్చు వేసింది అని సమాచారం ఉంది. ఇది రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేకంగా ఆ లక్ష్యానికి కేటాయించిన మొత్తం నిధులు గా పేర్కొనబడింది. ఈ నిధి మొత్తం పథకం ఫిర్యాదులను, సర్వీస్ ప్రావైడర్లు కోసం చెల్లింపులు, ఆసుపత్రి ఖర్చులు, పాలన ఖర్చులు వంటి అక్కడి వైద్య ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది.

గతంలో ఉన్న పథకాలు

పంజాబ్‌లో మొదటి కీలక ఆరోగ్య బీమా పథకం 2019లో ముఖ్యమంత్రి సేహత్ బీమా యోజనగా ప్రారంభమై, ఆర్థికంగా అప్పటికే వెనుకబడిన వర్గాలకు రూ.5 లక్షల వైద్య బీమాకు కవర్ ఇస్తుంది. తరువాత సర్బత్ సేహత్ వంటి విస్తృత పథకాల ద్వారా మరిన్ని కుటుంబాలు లబ్ధి పొందాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో

2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్యశ్రీ పథకానికి విశేషంగా నిధులు కేటాయించింది. ప్రభుత్వ నివేదికల ప్రకారం సుమారు రూ.1,143 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ పథకానికి 2024-25 నుంచి 2025‌ వరకు మూడు విడతలుగా రూ. 5,562 కోట్ల విలువైన వైద్యం సేవలను అందించారు.

పంజాబ్‌లో ప్రతి ఇంటికీ ‘ఆరోగ్య ధీమా’ - Tholi Paluku