
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో గాయని మంగ్లీ ఫిర్యాదు
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ రెండు పరస్పర వివాదాలు చోటుచేసుకున్నాయి. వేధింపులు, వసూళ్ల ఆరోపణలతో ఆమె పోలీసులను ఆశ్రయించగా, మరోవైపు ఆమెపైనే భారీ ఆర్థిక మోసం ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది.
తనను వేధిస్తున్నారంటూ మంగ్లీ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తరఫు న్యాయవాదితో కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదును పోలీసులకు అందజేశారు. న్యాయవాది సుబ్బారావు అనే వ్యక్తి తన కార్యాలయానికి వచ్చి, రూ.10 లక్షలు డిమాండ్ చేశారని, ఇవ్వనందుకు దుర్భాషలాడుతూ.. మీడియాలో దుష్ప్రచారం చేస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, అదే పోలీస్ స్టేషన్‌లో మంగ్లీపై న్యాయవాది సుబ్బారావు మరో ఫిర్యాదు చేశారు. మైక్రోఫైనాన్స్ పేరుతో మంగ్లీ తనను రూ. 10 కోట్ల మేర మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఒకవైపు హరాస్‌మెంట్ కేసు, మరోవైపు భారీ ఆర్థిక మోసం ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఒకే సమయంలో పరస్పర విరుద్ధమైన ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఈ రెండు కేసులను లోతుగా విచారిస్తున్నారు. మంగ్లీ చేసిన ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది? అలాగే సుబ్బారావు చేస్తున్న రూ. 10 కోట్ల మోసం ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ పరిణామాలు గాయని మంగ్లీ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
