Let's talk: editor@tmv.in
‘పంచ్’ అదిరింది.. ప్రపంచ బాక్సింగ్‌లో భారత్‌కు పతకాల పంట!

‘పంచ్’ అదిరింది.. ప్రపంచ బాక్సింగ్‌లో భారత్‌కు పతకాల పంట!

Shaik Mohammad Shaffee
16 మార్చి, 2026

థాయ్‌లాండ్‌ వేదికగా జరిగిన 'వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్ 2026'లో భారత యువ బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆదివారంతో ముగిసిన ఈ టోర్నీలో భారత్ మొత్తం ఐదు పతకాలను (1 స్వర్ణం, 3 రజతాలు, 1 కాంస్యం) కైవసం చేసుకుంది. మహిళల 51 కిలోల విభాగంలో చంద్రిక పూజారి పసిడి పతకంతో గర్జించి భారత పతకాల వేటలో అగ్రగామిగా నిలిచింది. ఫైనల్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన మర్డోనోవా నజోకత్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన చంద్రిక, రిఫరీల ఏకగ్రీవ నిర్ణయంతో స్వర్ణాన్ని ముద్దాడింది.

ముగ్గురికి రజతాలు

మరో ముగ్గురు భారత బాక్సర్లు ఫైనల్ వరకు దూసుకెళ్లి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. మహిళల 48 కిలోల విభాగంలో గుంజన్ ఇంగ్లాండ్ బాక్సర్‌ చేతిలో 5-0తో ఓటమి పాలవ్వగా, 54 కిలోల విభాగంలో జోయశ్రీ దేవి అమెరికాకు చెందిన గ్వాడలూప్ రూయిజ్‌తో హోరాహోరీగా తలపడి 4-1తో పోరాడి ఓడింది. పురుషుల 50 కిలోల విభాగంలో అంబేకర్ మీతీ కూడా ఫైనల్ మెట్టుపై తడబడి ఉక్రెయిన్‌ బాక్సర్‌ మైఖైలో సిడోరెంకో చేతిలో పరాజయం పొంది రజతాన్ని దక్కించుకున్నాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్‌లో రాధామణి లాంగ్జామ్ (57 కిలోలు) ఉక్రెయిన్‌ అథ్లెట్‌పై తీవ్రంగా శ్రమించినా కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

లక్ష్యం.. డాకర్ యూత్ ఒలింపిక్స్

మార్చి 8 నుంచి 15 వరకు బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీలు ఈ ఏడాది అక్టోబర్‌లో సెనెగల్‌ (ఆఫ్రికా) రాజధాని డాకర్‌లో జరిగే 'యూత్ ఒలింపిక్ గేమ్స్'కు అర్హత మార్గంగా నిలిచాయి. 2008 జనవరి 1 నుంచి 2009 డిసెంబర్ 31 మధ్య జన్మించిన క్రీడాకారులకు మాత్రమే ఈ టోర్నీలో అవకాశం కల్పించారు. ఆఫ్రికా ఖండంలో జరుగుతున్న తొలి ఒలింపిక్ ఈవెంట్ అయిన డాకర్-2026లో తమ స్థానాలను సుస్థిరం చేసుకునేందుకు భారత యువ బాక్సర్లు ఈ టోర్నీ ద్వారా గట్టి పునాది వేసుకున్నారు.

భారత పతక విజేతలు వీరే!

స్వర్ణం:

చంద్రిక పూజారి (51 కిలోలు)

రజతం:

గుంజన్ (48 కిలోలు), జోయశ్రీ దేవి (54 కిలోలు), అంబేకర్ మీతీ (50 కిలోలు)

కాంస్యం:

రాధామణి లాంగ్జామ్ (57 కిలోలు)