Let's talk: editor@tmv.in
పంచాయతీ పోరు.. ఏర్పాట్లు షురూ: పోలింగ్ కేంద్రాల తనిఖీ, పోలీస్ యాక్ట్ అమలు

పంచాయతీ పోరు.. ఏర్పాట్లు షురూ: పోలింగ్ కేంద్రాల తనిఖీ, పోలీస్ యాక్ట్ అమలు

Gaddamidi Naveen
3 డిసెంబర్, 2025

రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వివిధ జిల్లాల యంత్రాంగాలు ముమ్మర ఏర్పాట్లు చేపట్టాయి. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తూ, పలు ప్రాంతాల్లో పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 150కి పైగా సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ గ్రామాల్లో కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. తొలి దశ పోలింగ్ డిసెంబర్ 11న జరగనుంది.

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని కొంకల, తనగల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు పరిశీలించారు. ఎన్నికల వేళ సిబ్బంది తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ప్రతి కేంద్రంలో అవసరమైన సౌకర్యాలు,పై దృష్టి పెట్టేలా సూచనలు జారీ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని, పోలీసులు 1861 యాక్ట్ ప్రకారం ఈ నెల 30వ తేదీ వరకు జిల్లా అంతటా పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ మహేష్ గీతే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చర్య ద్వారా ఎన్నికల సమయంలో అస్థిరతలు, అశాంతులను నివారించడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు.ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలంలోని నామినేషన్ కేంద్రాలు, భూభారతి అర్జీలను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ, లాగ్ రికార్డుల నిర్వహణ, అభ్యర్థులకోసం సౌకర్యాల ఏర్పాట్లపై పూర్తి తనిఖీ చేశారు. అదే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ గరీమ అగర్వాల్ పరిశీలించి, ఆర్ఓ కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నదో లేదో తనిఖీ చేశారు.

సూర్యాపేట జిల్లాలో కూడా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మంగ‌ళ‌వారం నుంచి ఈ నెల 31 వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంచినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లాలంతటా పోలీసు బలగాలు, నియామక సిబ్బంది, మానిటరింగ్ చర్యలు కట్టుదిట్టంగా చేపట్టబడ్డాయి.

పంచాయతీ ఎన్నికలు

మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.రాష్ట్రంలోని గ్రామీణ గ్రామపంచాయతీ ఓటర్ల సంఖ్య సుమారు 1.67 కోట్లుగా ఉంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు మొత్తం మూడు విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్ డిసెంబర్ 11, 14,17న జరగనున్నాయి.ఈ ఎన్నికలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు, బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.