Let's talk: editor@tmv.in
పంచాయతీరాజ్‌ ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. పవన్‌ విచారం

పంచాయతీరాజ్‌ ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. పవన్‌ విచారం

Pinjari Chand
18 ఆగస్టు, 2026

రాజమహేంద్రవరం సమీపంలో పంచాయతీరాజ్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరమైతే జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందాల సేవలను వినియోగించాలని సూచించారు. ఘటనపై తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల ఎస్పీలతో పవన్‌ కల్యాణ్‌ ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా

ఏఈ నూకరాజు కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన పరిస్థితులపై పవన్‌ కల్యాణ్‌ ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఘటన నుంచి బయటపడిన నూకరాజు మనుమడి ఆరోగ్య పరిస్థితిపై కూడా ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. బాలుడికి అవసరమైన వైద్య సాయం అందించి పూర్తిగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

‘ప్రాణం అమూల్యం’

ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కార మార్గం ఉంటుందని పవన్‌ పేర్కొన్నారు. క్షణికావేశం, మానసిక ఒత్తిడికి లోనై ఎవరూ ప్రాణాలు తీసుకునే నిర్ణయం తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బెదిరింపులు, వేధింపులు లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను, సంబంధిత అధికారులను సంప్రదించి చట్టపరమైన సహాయం పొందాలని సూచించారు. ప్రాణం ఎంతో విలువైనదని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

ఘటన వివరాలు

కాకినాడ నుంచి కారులో రాజమహేంద్రవరం వైపు వచ్చిన పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ నూకరాజు (61) తన భార్య మీనా (59), కుమార్తె సౌజన్య (34), మనవడు రేయాన్ష్‌ కార్తికేయతో కలిసి ఆగస్టు 16 ఆదివారం అర్ధరాత్రి తర్వాత రాజమహేంద్రవరం సమీపంలోని గోదావరి రోడ్‌-కమ్‌-రైలు బ్రిడ్జి వద్ద నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో మనవడు రేయాన్ష్‌ కార్తికేయను మత్స్యకారులు రక్షించగా, నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. నూకరాజు రాసినట్లు చెబుతున్న లేఖలో తన కుమార్తె ఎదుర్కొంటున్న వేధింపులు, బెదిరింపుల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఆత్మహత్యాయత్నానికి అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పంచాయతీరాజ్‌ ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. పవన్‌ విచారం - Tholi Paluku