
పంచదార్ల కొండ అక్రమ మైనింగ్‌పై పవన్ కళ్యాణ్ సీరియస్.. సమగ్ర విచారణకు ఆదేశం..
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని పంచదార్ల కొండ రెవెన్యూ భూముల్లో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ తవ్వకాలు నిర్వహించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించిన నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టి పూర్తి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆయన ఆదేశించారు.
పంచదార్ల కొండలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ అందించిన ప్రాథమిక నివేదికను పరిశీలించిన అనంతరం, పర్యావరణ పరిరక్షణతో పాటు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రాథమిక నివేదికల ప్రకారం, మైనింగ్‌కు అనుమతులు పొందిన సంస్థ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ గ్రావెల్, మట్టి తవ్వకాలు చేపట్టినట్లు ఆధారాలు ఉన్నాయని అధికారులు గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఆ సంస్థపై నిబంధనల ప్రకారం భారీ పర్యావరణ జరిమానా విధించడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జరిమానా విధించడమే కాకుండా, తవ్వకాల వల్ల జరిగిన పర్యావరణ నష్టాన్ని పునరుద్ధరించే బాధ్యతను కూడా సంబంధిత సంస్థపైనే మోపాలని సూచించారు.
మైనింగ్ కార్యకలాపాల ప్రభావంతో పంచదార్ల కొండ దిగువన ఉన్న ప్రసిద్ధ శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం, పరిసర ప్రాంతంలోని సహజ జలధారలకు నష్టం కలిగే అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయ రక్షణతో పాటు సహజ వనరుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
పంచదార్ల ప్రాంతంలోని సహజ జలధారల నీటి రంగు మార్పుపై శాస్త్రీయంగా అధ్యయనం జరిపించాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇందుకోసం జాతీయ జలవిజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలను ఆహ్వానించి, జలధారల మూలాలను పరిశీలించాలని సూచించారు. శాస్త్రీయ నివేదికల ఆధారంగా సహజ నీటి ప్రవాహాలను సంరక్షించే చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పురాతన ఆలయాలు, ప్రకృతి సంపదలు రాష్ట్ర వారసత్వమని, వాటి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచదార్ల కొండలోని శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ కోసం పురావస్తు శాఖ, దేవాదాయ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆయన ఆదేశించారు.
భవిష్యత్తులో ఇటువంటి అక్రమ తవ్వకాలు జరగకుండా ఉండేందుకు పంచదార్ల కొండ పరిసర ప్రాంతాన్ని పూర్తిగా 'నో మైనింగ్ జోన్'గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచించారు. దీంతో ఆ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలకు శాశ్వతంగా అడ్డుకట్ట పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అలాగే, నిబంధనలు ఉల్లంఘించిన మైనింగ్ సంస్థకు గతంలో మంజూరు చేసిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్‌మెంట్ అనుమతులు, ఆపరేషన్స్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పర్యావరణ పరిరక్షణ, సహజ జలవనరుల సంరక్షణ, చారిత్రక దేవాలయాల రక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.
