Let's talk: editor@tmv.in
న్యూ ఇయ‌ర్ వేడుకల్లో ‘జీరో డ్రగ్స్’ లక్ష్యం: సీపీ సజ్జనార్

న్యూ ఇయ‌ర్ వేడుకల్లో ‘జీరో డ్రగ్స్’ లక్ష్యం: సీపీ సజ్జనార్

Gaddamidi Naveen
27 డిసెంబర్, 2025

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భాగ్యనగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ముఖ్యంగా మాదకద్రవ్యాల నియంత్రణకు హైదరాబాద్ పోలీసులు నడుం బిగించారు. నగరంలో ‘జీరో డ్రగ్స్’ విధానాన్ని అమలు చేయడమే లక్ష్యంగా కఠిన చర్యలు చేపట్టాలని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ , ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు చేస్తామని ఆయన స్పష్టంగా హెచ్చరించారు.

బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో హెచ్‌-న్యూ, టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, వెస్ట్‌జోన్‌, సీసీఎస్‌ తదితర విభాగాల అధికారులతో సీపీ సజ్జనార్ విస్తృతంగా చర్చించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్‌ వినియోగం, సరఫరాపై ఎలాంటి ఉపేక్ష ఉండదని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం నుంచే నగరవ్యాప్తంగా పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించాం. ప్రధాన వేదికలతో పాటు సర్వీస్‌ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లు, ప్రైవేట్‌ పార్టీలపైనా గట్టి నిఘా ఉంటుంది. గత రెండేళ్లలో డ్రగ్స్‌ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. డ్రగ్స్‌ సరఫరాదారులు, వినియోగదారుల జాబితా సిద్ధం చేసి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించాం అని సీపీ తెలిపారు. అదేవిధంగా నూతన సంవత్సర వేడుకల సమయంలో పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే మూసివేయాలని ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుని, లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

మైత్రీవనం, నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌బండ్‌, కేబీఆర్‌ పార్క్‌ వంటి జనసమ్మర్దం అధికంగా ఉండే ప్రాంతాల్లో పటిష్టమైన చెక్‌పోస్టులు, బ్యారికేడింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సర్వీస్‌ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్‌ వేడుకలపై కూడా నిఘా కొనసాగించాలని అధికారులకు సూచించారు. అయితే నిఘా పేరుతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆయ‌న పేర్కొన్నారు.

పోలీసు అధికారులు సమన్వయంతో పని చేసి నగర పోలీసు ప్రతిష్టను మరింత పెంచాలని సీపీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీసీపీలు ఎన్‌.శ్వేత, కె.అపూర్వ రావు, రక్షిత కృష్ణమూర్తి, సిహెచ్‌. రూపేష్‌, చింతమనేని శ్రీనివాస్‌, గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ సహా టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీలు అందే శ్రీనివాస రావు, ఇక్బాల్‌ సిద్ధిఖీ తదితర అధికారులు పాల్గొన్నారు.

న్యూ ఇయ‌ర్ వేడుకల్లో ‘జీరో డ్రగ్స్’ లక్ష్యం: సీపీ సజ్జనార్ - Tholi Paluku