
న్యూ ఇయర్ వేడుకలు.. అర్ధరాత్రి ఒంటిగంట వరకు హైదరాబాద్ మెట్రో సర్వీసులు!
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరవాసులకు ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సంస్థ తీపి కబురు అందించింది. నేడు అర్ధరాత్రి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా రాత్రి 11 గంటలకు ముగిసే సర్వీసులు, న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా అర్ధరాత్రి 1:00 గంట వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు ఒంటిగంటకు బయలుదేరి, సుమారు రెండు గంటల కల్లా సంబంధిత గమ్యస్థానాలకు చేరుకుంటుంది. వేడుకల అనంతరం ప్రజలు సురక్షితంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇళ్లకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ వెసులుబాటును వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు ఒత్తిడి లేకుండా, సురక్షితంగా ప్రయాణిస్తూ కొత్త సంవత్సరం 2026లోకి అడుగుపెట్టాలని ఈ ప్రకటనలో పిలుపునిచ్చారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
