
న్యూయార్క్ హాఫ్ మారథాన్‌లో గుల్వీర్ సింగ్‌కు కాంస్యం
భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ అంతర్జాతీయ వేదికపై మరోసారి తన సత్తా చాటాడు. అమెరికాలో ఆదివారం జరిగిన ప్రతిష్టాత్మక 'న్యూయార్క్ హాఫ్ మారథాన్ 2026'లో గుల్వీర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ లేబుల్ రోడ్ రేస్‌గా గుర్తింపు పొందిన ఈ పోటీలో, గుల్వీర్ నిర్ణీత దూరాన్ని 59:42 నిమిషాల్లో పూర్తి చేసి మూడవ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఒలింపియన్ అడ్రియన్ వైల్డ్‌షట్ (59:30) స్వర్ణం గెలవగా, అమెరికా అథ్లెట్ జుహైర్ తల్బీ (59:41) రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
రికార్డు సమయం
ఈ రేసులో గుల్వీర్ నమోదు చేసిన సమయం (59:42) అద్భుతమైనదని క్రీడా పండితులు ప్రశంసిస్తున్నారు. 2020 ఢిల్లీ హాఫ్ మారథాన్‌లో అవినాష్ సాబిల్ నెలకొల్పిన జాతీయ రికార్డు (1:00:30 సెకన్లు) కంటే ఇది చాలా మెరుగైనది. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా ఇది కొత్త జాతీయ రికార్డుగా నమోదు కాదు. న్యూయార్క్ కోర్సు 'పాయింట్-టు-పాయింట్' (ప్రారంభ, ముగింపు స్థానాల మధ్య దూరం, ఎత్తుపల్లాల పరిమితి) స్వభావాన్ని కలిగి ఉండటంతో, ఇక్కడ నమోదైన సమయాలను అధికారిక జాతీయ రికార్డులుగా పరిగణించరు. దీంతో హాఫ్ మారథాన్‌లో అవినాష్ సాబిల్ పేరిట ఉన్న రికార్డు అలాగే కొనసాగనుంది.
ఫామ్‌లో గుల్వీర్ సింగ్
27 ఏళ్ల గుల్వీర్ సింగ్‌కు ఈ ఏడాది ఇది మూడవ ప్రధాన పోటీ. జనవరిలో జరిగిన వరల్డ్ క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో 40వ స్థానంలో నిలిచిన ఆయన, ఫిబ్రవరిలో విన్స్టన్-సేలమ్‌లో జరిగిన సౌండ్ రన్నింగ్ ఇన్వైట్ 5,000 మీటర్ల షార్ట్ ట్రాక్ విభాగంలోనూ మూడవ స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం గుల్వీర్ పేరిట 3,000 మీటర్లు, 5,000 మీటర్లు, 10,000 మీటర్ల విభాగాల్లో మూడు జాతీయ రికార్డులు ఉన్నాయి. అంతేకాకుండా, 5,000మీ, 10,000మీ విభాగాల్లో ఆయన ప్రస్తుత ఆసియా ఛాంపియన్‌గా కొనసాగుతున్నారు. తాజా పతకంతో గుల్వీర్ తన ఫామ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు.
