
న్యూయార్క్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. ఇద్దరు పైలట్ల మృతి
అమెరికాలోని న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మోంట్రియల్ నుంచి వచ్చిన 'ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్' (జాజ్ ఏవియేషన్) విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో పోర్ట్ అథారిటీకి చెందిన అగ్నిమాపక వాహనాన్ని అత్యంత వేగంతో ఢీకొట్టింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:40 గంటలకు జరిగిన ఈ ఘటనలో విమానంలోని పైలట్, కో-పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ధాటికి విమానం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి పైకి లేవగా, వెనుక భాగం రన్‌వేను తాకుతూ నిలిచిపోయింది.
సహాయక చర్యలకు వెళ్తుండగా..
వేరొక విమానానికి సంబంధించిన అత్యవసర పిలుపు మేరకు రన్‌వేపై వేగంగా వెళ్తున్న 'ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్' వాహనాన్ని, అదే సమయంలో ల్యాండ్ అయిన విమానం నేరుగా ఢీకొంది. ఈ విమానంలో 72 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు ఎయిర్ కెనడా ధ్రువీకరించింది. విమానం ముందు భాగం నేరుగా ట్రక్కును తాకడంతో కాక్‌పిట్‌లో ఉన్న పైలట్లు ఇద్దరూ మరణించారు. అగ్నిమాపక వాహనంలో ఉన్న నలుగురు ఫైర్ ఫైటర్లు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద విమాన ప్రయాణికులతో కలిపి 41 మంది క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
స్తంభించిన రాకపోకలు.. విమానాశ్రయం మూసివేత
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రంగంలోకి దిగి లాగార్డియాలో విమానాల రాకపోకలను తక్షణమే నిలిపివేసింది. 'గ్రౌండ్ స్టాప్' ప్రకటించడంతో న్యూయార్క్ రావాల్సిన విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించగా, బయలుదేరాల్సిన వందలాది సర్వీసులు రద్దయ్యాయి. అటు నెవార్క్ విమానాశ్రయంలో కూడా ఎలివేటర్ నుంచి కాలిన వాసన రావడంతో కాసేపు టవర్‌ను ఖాళీ చేయించాల్సి వచ్చింది.
కమ్యూనికేషన్ లోపమే కారణమా?
ఈ ఘోర ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ సమగ్ర విచారణ ప్రారంభించింది. అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ బాధితులకు సానుభూతి తెలుపుతూ, దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను పంపారు. రన్‌వేపై విమానం, ఫైర్ ట్రక్కు మధ్య కమ్యూనికేషన్ లోపం తలెత్తిందా? లేక ఏటీసీ సూచనల్లో పొరపాట్లు జరిగాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కెనడా రవాణా భద్రతా బోర్డు కూడా విచారణలో భాగస్వామి అయ్యింది. ప్రస్తుతం రన్‌వేపై శిథిలాలను తొలగించి, భద్రతా ప్రమాణాలను పునఃపరిశీలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
