Let's talk: editor@tmv.in
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ విజయం

న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ విజయం

Shaik Mohammad Shaffee
6 నవంబర్, 2025

భారతీయ సంతతికి చెందిన డెమొక్రాటిక్ సోషలిస్ట్ చట్టసభ సభ్యుడు జోహ్రాన్ మమ్దానీ (34) న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో సంచలన విజయం సాధించారు. అమెరికాలోని అతిపెద్ద నగరానికి నాయకత్వం వహించడానికి ఎన్నికైన మొదటి దక్షిణాసియా, మొదటి ముస్లిం వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఉగాండాలో జన్మించిన మమ్దానీ తల్లిదండ్రులు భారతీయ సంతతికి చెందినవారు. ఆయన తల్లి ప్రముఖ సినీ దర్శకురాలు మీరా నాయర్ కాగా, తండ్రి విద్యావేత్త మహమూద్ మమ్దానీ.

ఎన్నికల ఫలితాలు

మమ్దానీ, మాజీ గవర్నర్ ఆండ్రూ క్యుమో, రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివా వంటి బలమైన అభ్యర్థులను ఓడించారు. 83 శాతం ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సమయానికి, మమ్దానీ 9,48,202 ఓట్లు (50.6 శాతం) సాధించి న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించారు.

మాజీ న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యుమో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఎన్నికల ముందు రోజు మాత్రమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు పొందారు. క్యుమోకు 7,76,547 ఓట్లు (41.3 శాతం) వచ్చాయి. రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివాకు 1,37,030 ఓట్లు వచ్చాయి.

న్యూయార్క్ సిటీ ఎన్నికల బోర్డు ప్రకారం, ఈసారి 1969 తర్వాత మొదటిసారిగా రెండు మిలియన్లకు పైగా ఓట్లు నమోదయ్యాయి. మాన్హాటన్‌లో 4,44,439, బ్రోంక్స్‌లో 1,87,399, బ్రూక్లిన్‌లో 5,71,857, క్వీన్స్‌లో 4,21,176, స్టాటెన్ ఐలాండ్‌లో 1,23,827 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించారు.

డెమోక్రాటిక్ ప్రైమరీలోనే మమ్దానీ కువోమోను ఓడించి ముందంజలో నిలిచారు. “తక్కువ ఆదాయం గల వర్గాల కోసం జీవన వ్యయాన్ని తగ్గించడం” తన ప్రధాన లక్ష్యమని ఆయన తన ప్రచారంలో తెలిపారు. యువత, కార్మిక వర్గాలు మమ్దానీకి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు.

మమ్దానీ విజయం న్యూయార్క్ నగరానికి, అమెరికా రాజకీయాలకూ ఒక కొత్త దశను తీసుకొచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు కేంద్రమైన ఈ నగరానికి ఇప్పుడు ఒక డెమోక్రాటిక్ సోషలిస్టు నాయకత్వం వహించనున్నాడు. ఉగాండా రాజధాని కంపాలాలో జన్మించిన మమ్దానీ, ఏడు సంవత్సరాల వయసులో తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ సిటీకి మారారు. ఆయన 2018లో అమెరికా పౌరసత్వం పొందారు.

మమ్దానీ విజయ ప్రసంగం

న్యూయార్క్ మేయర్‌గా విజయం సాధించిన అనంతరం మాట్లాడుతూ, ఈ రాత్రి మనం చరిత్ర సృష్టించాం. నెల్సన్ మండేలా మాటల్లో చెప్పాలంటే ‘ఇది సాధ్యం కాదు అనిపిస్తుంది… కానీ అది జరిగేవరకు మాత్రమే.’ ఈ రోజు, మేము సాధించాం.” అని అన్నారు. “ఇది నా విజయం కాదు.. మనందరి విజయం. న్యూయార్క్ ప్రజల విజయం. ఈ నగరాన్ని అందరికీ అందుబాటులో ఉంచే హక్కు కోసం, ప్రతి కుటుంబం గౌరవంగా జీవించే హక్కు కోసం పోరాడిన ప్రజల విజయం.” అని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన నెహ్రూ ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని ప్రస్తావించారు. ”ఒక నవ శకం వైపు అడుగు వేస్తున్నప్పుడు, ఒక యుగం ముగిసినప్పుడు, సుదీర్ఘకాలం అణచివేతకు గురైన ఒక జాతి గళం వినిపించినప్పుడు... చరిత్రలో ఇలాంటి అపూర్వ క్షణాలు అరుదుగా వస్తాయి" అనే నెహ్రూ వ్యాఖ్యలను ఆయన తన విజయానికి ఆపాదించుకుంటూ మాట్లాడారు.

న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ విజయం - Tholi Paluku