Let's talk: editor@tmv.in
న్యూయార్క్ కొత్త మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ ప్రమాణ స్వీకారం

న్యూయార్క్ కొత్త మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ ప్రమాణ స్వీకారం

Shaik Mohammad Shaffee
1 జనవరి, 2026

న్యూయార్క్ నగర కొత్త మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ నూతన సంవత్సరం ప్రారంభం నుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. 2026 సంవత్సరం మొదలయ్యే అర్ధరాత్రి నుండే ఆయన మేయర్ పదవిలోకి రానున్నారు. కొత్త ఏడాది వేడుకలతో పాటే మమ్దానీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా నగరంలో అట్టహాసంగా జరగనున్నాయి.

రెండుసార్లు ప్రమాణ స్వీకారం

సాంప్రదాయం ప్రకారం, న్యూయార్క్ మేయర్ పదవీకాలం నూతన సంవత్సరంతోనే ప్రారంభమవుతుంది. అందుకే అక్కడ కొత్త మేయర్ రెండు విడతలుగా ప్రమాణ స్వీకారం చేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మమ్దానీ బృందం కూడా రెండు వేర్వేరు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.

మొదటి ప్రమాణ స్వీకారం అమెరికా కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి సమయంలో జరగనుంది. ఇది కుటుంబ సభ్యుల సమక్షంలో, చిన్న స్థాయిలో జరిగే వ్యక్తిగత కార్యక్రమం. ఈ కార్యక్రమం మాన్హాటన్‌లో ఉన్న పాత సిటీ హాల్ సబ్‌వే స్టేషన్‌లో జరుగుతుంది. ఈ స్టేషన్ న్యూయార్క్ తొలి సబ్‌వే లైన్‌కు చెందిన ముఖ్యమైన కేంద్రంగా ఒకప్పుడు పేరు పొందింది. ప్రస్తుతం ఇది చారిత్రక ప్రదేశంగా మాత్రమే ఉపయోగంలో ఉంది. ఈ కార్యక్రమంలో న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ జోహ్రాన్ మమ్దానీతో ప్రమాణం చేయించనున్నారు. ఆమె మమ్దానీకి రాజకీయ మిత్రురాలిగా, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రముఖ ప్రత్యర్థిగా పేరుగాంచారు.

రైలు స్టేషన్‌లో ఎందుకు?

పాత సిటీ హాల్ సబ్‌వే స్టేషన్‌ను ప్రమాణ స్వీకార వేదికగా ఎంచుకోవడం ద్వారా నగరాన్ని నడిపించే శ్రామిక వర్గాల పట్ల తన నిబద్ధతను చూపించాలనేదే ఉద్దేశమని మమ్దానీ కార్యాలయం తెలిపింది. “1904లో ఈ స్టేషన్ ప్రారంభమైనప్పుడు, అది సాధారణ ప్రజల జీవితాలను మార్చే కలలతో నిర్మించిన న్యూయార్క్‌కు ప్రతీకగా నిలిచింది” అని మమ్దానీ వ్యాఖ్యానించారు.

ప్రముఖుల సమక్షంలో వేడుక

అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం మరోసారి అధికారికంగా మమ్దానీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం సిటీ హాల్ మెట్లపై మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతుంది. అమెరికా సెనేటర్ బెర్నీ శాండర్స్ మమ్దానీతో ప్రమాణం చేయించనున్నారు. ప్రారంభ ప్రసంగాన్ని ఎంపీ అలెగ్జాండ్రియా ఓకాసియో-కోర్టెజ్ చేయనున్నారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున కళాకారులు, రచయితలు, సామాన్య ప్రజలు హాజరుకానున్నారు. సిటీ హాల్ బయట 'బ్లాక్ పార్టీ' పేరుతో పెద్ద ఎత్తున సంగీత విభావరులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వేలాది మంది ప్రజలు ఈ వేడుకలో పాల్గొని తమ కొత్త మేయర్‌కు స్వాగతం పలకనున్నారు.

మమ్దానీ బాధ్యతలు చేపట్టే వేళ, న్యూయార్క్ నగర అభివృద్ధిపై ప్రజల్లో పెద్ద అంచనాలు నెలకొన్నాయి. కొత్త ఏడాదితో పాటు నగరానికి కొత్త నాయకత్వం రాబోతోందని న్యూయార్క్ వాసులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.