Let's talk: editor@tmv.in
న్యూఢిల్లీ లో యూపీఎస్సీ అభ్యర్థి దారుణ హత్య

న్యూఢిల్లీ లో యూపీఎస్సీ అభ్యర్థి దారుణ హత్య

Panthagani Anusha
28 అక్టోబర్, 2025

ఢిల్లీలో జరిగిన ఒక అత్యంత దారుణమైన హత్య కేసులో ఢిల్లీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. గాంధీ విహార్ ప్రాంతంలో కాలిపోయిన మృతదేహంగా లభించిన 32 ఏళ్ల యూపీఎస్సీ అభ్యర్థి రామ్‌కేష్ మీనా హత్య కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇందులో మృతుడితో లివ్-ఇన్ రిలేషన్ లో ఉన్న యువతి, ఆమె మాజీ ప్రియుడు, అతని సహచరుడు ఉన్నారు. అనుచిత వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేయడమే ఈ దారుణమైన కుట్రకు ప్రధాన కారణమని దర్యాప్తులో తేలింది.

హత్యకు దారి తీసిన వేధింపులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యువతి (21), ఫారెన్సిక్ సైన్స్‌లో బీఎస్సీ చదువుతోంది. మీనా ఆమె యొక్క అనుచిత వీడియోలు రికార్డ్ చేసి, వాటిని తొలగించడానికి నిరాకరిస్తూ వేధించడం ప్రారంభించాడు. ఈ విషయం తన మాజీ ప్రియుడికి చెప్పడంతో కోపంతో ఆ ముగ్గురూ కలిసి మీనాను హతమార్చడానికి పథకం రచించారు. వీరి ముగ్గురూ ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందినవారు.

హత్య తర్వాత ఆధారాలు మాయం చేసే యత్నం

ఈ ఘోరం అక్టోబర్ 6న వెలుగు చూసింది. అగ్నిమాపక సిబ్బందికి ఏసీ పేలి మంటలు వచ్చాయని సమాచారం అందడంతో . మంటలను ఆర్పి చూస్తే గదిలో మీనా మృతదేహం తీవ్రంగా కాలిపోయి కనిపించింది. అనంతరం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా, నిందితులు మీనాను హత్య చేసిన తర్వాత, మృతదేహంపై కిరోసిన్, మద్యం పోసి నిప్పంటించారు. అనంతరం హత్యను ప్రమాదంగా చూపించడానికి ఎల్‌పీజీ పంపిణీదారు అయిన మాజీ ప్రియుడు గ్యాస్ సిలిండర్ వాల్వును తెరిచి మంట పెట్టడంతో చిన్న పేలుడు కూడా సంభవించింది. పేలుడు తర్వాత నిందితులు మీనా హార్డ్‌డిస్క్, ల్యాప్‌టాప్‌లు, ఇతర వస్తువులను తీసుకుని పరారయ్యారు.

సీసీటీవీ ద్వారా ఛేదన

కాగా కేసు విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లో ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఫ్లాట్‌లోకి ప్రవేశించడం, ఆ తర్వాత తెల్లవారుజామున 2:57 గంటల సమయంలో యువతి వారిలో ఒకరిని వెంటబెట్టుకుని బయటకు వెళ్లడం రికార్డు అయ్యింది. దీంతో యువతి కాల్ రికార్డులు ఘటన ప్రాంతానికి సమీపంలో ఉన్నట్లు ధ్రువీకరించడంతో, పోలీసులు ఆమెను అక్టోబర్ 18న మొరాదాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతో మిగతా ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. పోలీసులు ప్రస్తుతం సాక్ష్యాల కోసం బాధితుడి హార్డ్‌డిస్క్ ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

న్యూఢిల్లీ లో యూపీఎస్సీ అభ్యర్థి దారుణ హత్య - Tholi Paluku