
న్యూజెర్సీలో రెండు హెలికాప్టర్లు ఢీ.. ఒకరి మృతి
అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూజెర్సీ రాష్ట్రం హామంటన్ నగరంలో ఆదివారం ఉదయం రెండు హెలికాప్టర్లు గాలిలో ప్రయాణిస్తుండగా అనుకోకుండా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఒక హెలికాప్టర్ గిరగిర తిరుగుతూ మంటల్లో చిక్కుకుని కిందపడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
ఈ రెండు హెలికాప్టర్లలో కేవలం పైలట్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒక పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రెండో పైలట్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ, విజిబిలిటీ స్పష్టంగానే ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో ఒకరినొకరు చూసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
కంటతడి పెట్టిస్తున్న నేపథ్యం
ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న ఒక కేఫ్ యజమాని తెలిపిన వివరాలు అందరినీ కలచివేశాయి. ఆ ఇద్దరు పైలట్లు మంచి స్నేహితులని, ప్రతిరోజూ తన కేఫ్‌లో కలిసి టిఫిన్ చేసేవారని ఆయన చెప్పారు. ఆదివారం కూడా ఇద్దరూ కలిసి టిఫిన్ చేసి హెలికాప్టర్లలో బయలుదేరారు. అయితే కొద్దిసేపటికే ఆకాశంలోనే రెండు హెలికాప్టర్లు ఢీకొన్న దృశ్యాన్ని చూసి అక్కడున్నవారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని ఆయన తెలిపారు.
దర్యాప్తు ప్రారంభం
హామంటన్ పట్టణం న్యూజెర్సీ దక్షిణ భాగంలో, ఫిలడెల్ఫియాకు సుమారు 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సుమారు 15 వేల మంది నివసిస్తున్నారు. వ్యవసాయ ప్రాంతంగా పేరున్న ఈ పట్టణం పైనీ బారెన్స్ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది.
ఈ ప్రమాదంపై అమెరికా విమానయాన సంస్థతో పాటు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు చేపట్టాయి. విమాన ప్రమాదాల దర్యాప్తు నిపుణుడు అలన్ డీల్ మాట్లాడుతూ, ఇలాంటి గాల్లో ఢీకొనే ప్రమాదాలు సాధారణంగా పైలట్లు ఒకరినొకరు గమనించలేకపోవడం వల్లే జరుగుతాయని అన్నారు. ప్రమాద సమయంలో ఇద్దరు పైలట్ల మధ్య మాటల మార్పిడి (కమ్యూనికేషన్) ఎలా ఉంది? ఒకరి హెలికాప్టర్ మరొకరికి కనిపించకుండా ఏదైనా అడ్డు వచ్చిందా? అనే కోణంలో అధికారులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.
