Let's talk: editor@tmv.in
న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

Pinjari Chand
1 ఫిబ్రవరి, 2026

ఇషాన్ కిషన్ మెరుపు వేగంతో సాధించిన తొలి టీ20 అంతర్జాతీయ శతకం, అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్ న్యూజిలాండ్‌పై ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుని, టీ20 ప్రపంచకప్ టైటిల్ కు తన సన్నాహాలను అత్యంత సంతృప్తికరంగా ముగించింది. భారత్ 271/5 భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 225 పరుగులకు ఆలౌట్ అయింది. కిషన్ (103; 43 బంతుల్లో, 6 ఫోర్లు, 10 సిక్సర్లు), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (63; 30 బంతుల్లో) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ (5/51) కీలక పాత్ర పోషించాడు.

ఆరంభంలో రెండు ఓవర్లలోనే 40 పరుగులు ఇచ్చిన అర్ష్‌దీప్, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని తదుపరి మూడు ఓవర్లలో కేవలం 11 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఫిన్ అలెన్ (80; 38 బంతులు) ఆరంభంలో ధాటిగా ఆడినప్పటికీ, కివీస్‌ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. బిగ్ బాష్ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన అలెన్, అదే ఫామ్‌ను గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో కొనసాగించాడు. తొలి ఓవర్‌లోనే అర్ష్‌దీప్‌పై రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. రెండో ఓవర్‌లో వరుసగా 4,4,6,4,4తో మొత్తం 23 పరుగులు సాధించాడు. 22 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసిన అలెన్, అక్షర్ పటేల్ (3/33) బౌలింగ్‌లో ఔటయ్యాడు. రచిన్ రవీంద్రతో కలిసి అతను రెండో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పవర్‌ప్లే అనంతరం స్పిన్నర్లు అక్షర్, వరుణ్ చక్రవర్తి (1/36) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ పరుగుల వేగం తగ్గింది. అలెన్ ఔటైన తర్వాత వికెట్లు వరుసగా పడటంతో కివీస్ ఛేదనలో వెనకబడింది.

మళ్లీ విఫలమైన సంజూ శాంసన్

భారీగా హాజరైన ప్రేక్షకుల్లో జోష్ నింపింది మాత్రం ఇషాన్ కిషన్ ఆటే. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ త్వరగా ఔటైన తర్వాత కిషన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఓపెనర్ సంజూ శాంసన్ (6) ఈ సిరీస్‌లో వరుసగా ఐదోసారి విఫలమయ్యాడు. లాకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో అతను ఔటయ్యాడు. ఈ వైఫల్యం టీ20 ప్రపంచకప్ అవకాశాలపై పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. అభిషేక్ శర్మ (30; 16 బంతులు) వేగంగా ఆడినప్పటికీ, ఫర్గూసన్ ముందు లొంగిపోయాడు. పవర్‌ప్లేలో భారత్ 54/2 మాత్రమే చేసింది.

అక్కడి నుంచి కిషన్–సూర్యకుమార్ జోడీ న్యూజిలాండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మూడో వికెట్‌కు కేవలం 10 ఓవర్లలోనే 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో టీ20కి దూరమైన కిషన్ ఈ మ్యాచ్ లో బౌలర్లను ఊచకోత కోశాడు. ఫర్గూసన్‌పై వరుసగా ఫోర్, సిక్సర్‌తో దూకుడు ప్రారంభించిన కిషన్, 28 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ తన 3000వ టీ20 అంతర్జాతీయ పరుగును కూడా పూర్తి చేశాడు. లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీ ఓవర్‌లో కిషన్ 29 పరుగులు బాదగా, ఆ ఓవర్‌లో షాట్ల క్రమం – 4,4,4,6,4,6.

మధ్యలో సూర్యకుమార్ ఔటైనా కిషన్ ఆగలేదు. 42 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, హార్దిక్ పాండ్యాతో కలిసి సంబరాలు జరుపుకున్నాడు. అతని రెండో అర్ధశతకం కేవలం 14 బంతుల్లో రావడం విశేషం. చివరి 11 ఓవర్లలో భారత్ 189 పరుగులు చేసింది. కిషన్ షో జేకబ్ డఫీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్‌తో ముగిసింది. చివర్లో హార్దిక్ పాండ్యా (42; 17 బంతులు) ధాటిగా ఆడి భారత్ స్కోరును 250 దాటేలా చేశాడు. భారత్ చరిత్రలో నాలుగోసారి 250కు పైగా స్కోరు సాధించడం.