
న్యాయాధికారులను బందీలుగా ఎలా ఉంచుతారు? సుప్రీం సీరియస్
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా మాల్దా జిల్లాలో న్యాయాధికారులను బందీలుగా ఉంచిన ఘటనపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్‌ఐఏ ద్వారా విచారణ జరపాలని ఆదేశించింది. ఈ ఘటన రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని తీవ్రంగా వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు, ఎన్నికల జాబితా ప్రత్యేక పరిశీలన ప్రక్రియలో న్యాయాధికారులకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. అవసరమైన చోట్ల కేంద్ర బలగాలను నియమించాలని ఎలక్షన్ కమిషన్‌కు సూచించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు మాల్దా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 6న జరిగే విచారణకు వారు ఆన్‌లైన్‌లో హాజరుకావాలని ఆదేశించింది.
నీరు, ఆహారం అందకుండా అడ్డుకోవటమేమిటి?
ఎన్నికలకు సిద్ధమవుతున్న పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా సుమారు 60 లక్షల అభ్యంతరాలను పరిశీలించేందుకు పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి సుమారు 700 మంది న్యాయాధికారులను నియమించారు. ఈ క్రమంలో మాల్దా జిల్లాలోని కాలియాచక్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఏడుగురు న్యాయాధికారులను కొందరు దుండగులు బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీస్ వద్ద చుట్టుముట్టి బందీలుగా ఉంచినట్లు కోర్టు తెలిపింది. ముగ్గురు మహిళా న్యాయాధికారులు, ఒక ఐదేళ్ల చిన్నారి కూడా వారితో ఉన్నారని పేర్కొంది. తొమ్మిది గంటలకు పైగా వారికి ఆహారం, నీరు అందకుండా అడ్డుకున్నట్లు కోర్టు పేర్కొంది. సాయంత్రం వరకు రాష్ట్ర అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోల్‌కత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా జోక్యం చేసుకోవడంతో అర్ధరాత్రి తరువాత న్యాయాధికారులను విడుదల చేసినట్లు తెలిపింది. అయితే విడుదలైన తరువాత కూడా వారి వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు కోర్టు తెలిపింది. న్యాయాధికారులను భయభ్రాంతులకు గురిచేయడానికి చేసిన ప్రయత్నమని వ్యాఖ్యానించింది. ఇది కోర్టు అధికారాన్ని సవాల్ చేసే చర్యగా కూడా పేర్కొంది.
భద్రతా చర్యలు తీసుకోవాలి
ఈ ఘటన న్యాయాధికారులపై తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల ఎన్నికల జాబితా పరిశీలనలో పాల్గొంటున్న న్యాయాధికారుల భద్రతను నిర్ధారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. న్యాయాధికారులు పనిచేస్తున్న ప్రదేశాల్లో ఐదుగురికంటే ఎక్కువ మంది గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది. అలాగే ఎవరైనా న్యాయాధికారి తమ కుటుంబ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తే వెంటనే తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయ రంగు దాల్చుతోందని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు, పశ్చిమ బెంగాల్ దేశంలో అత్యంత విభజన ఉన్న రాష్ట్రంగా మారిందని కూడా వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించే సంస్థ ప్రాథమిక నివేదికను నేరుగా సుప్రీంకోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.
