
న్యాయవ్యవస్థలో పెండింగు కేసుల పెనుసమస్య
భారత ప్రజాస్వామ్యం తన బలాన్ని మూడు స్తంభాలపై నిలబెట్టుకుంది శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ. వీటిలో న్యాయవ్యవస్థ ప్రజల హక్కులను రక్షించే చివరి కంచె. కానీ ఈ కంచె నేటి రోజుల్లో భారంతో నలిగిపోతుంది. దేశవ్యాప్తంగా కోట్లు దాటిన పెండింగు కేసులు, న్యాయమూర్తుల కొరత, కాలం చెల్లిన పని విధానం -ఇవి అన్నీ కలిసి న్యాయవ్యవస్థను సంక్షోభ స్థితిలోకి నెట్టేశాయి. న్యాయం అందించే వ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తే, న్యాయం అనే భావన కూడా ప్రజలకు దూరమవుతుంది. ఈ వాస్తవం ఇప్పుడు దేశం ముందున్న అతి తీవ్రమైన పాలనా సవాళ్లలో ఒకటిగా నిలిచింది.
పెండింగు కేసుల మూలకారణాలు
1. న్యాయమూర్తుల తీవ్ర కొరత
భారత్, 140 కోట్లకు పైగా జనాభా. కానీ ఈ జనాభాకు సేవ చేయాల్సిన న్యాయమూర్తుల సంఖ్య చాలా తక్కువ. ప్రపంచ సగటుతో పోలిస్తే మనకు సరిపడినంత న్యాయమూర్తులు లేరు. ఇంకా నియామకాలు ఆలస్యం కావడం, శాశ్వత పోస్టులు ఖాళీగా ఉండడం, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలపై ఘర్షణల వలన న్యాయ వివాద పరిష్కారాలు ఆలస్యం అవుతూనే ఉన్నాయి
2. వాయిదాల సంస్కృతి
నేటి న్యాయవ్యవస్థలో “వాయిదా” ఒక సహజ ప్రక్రియల్లా మారింది. ఒక కేసు విచారణలో చిన్న తప్పు ఉండినా, న్యాయవాది హాజరుకాలేకపోయినా, పత్రాలు పూర్తిగా రాకపోయినా వాయిదా. ఇది సంవత్సరాల తరబడి పెరుగుతూ, చివరకు న్యాయం అందని ద్రాక్ష పండులా మారిపోయింది . విచారణలలో స్పష్టమైన టైమ్‌లైన్లు లేకపోవడం సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేసింది.
3. ప్రభుత్వమే అతిపెద్ద వివాదదారు
భారత కోర్టుల్లో నమోదైన కేసులలో గణనీయమైన శాతం ప్రభుత్వ శాఖల వల్లనే. ప్రభుత్వ విభాగాలు ఒక ఆదేశం నచ్చకపోతే వెంటనే అప్పీళ్లు చేస్తూనే ఉంటాయి. అప్పీల్స్ అనవసరంగా పెరగడం వల్ల కోర్టుల పని మరింత సుదీర్ఘమవుతుంది. కేసులను కోర్టులకు పంపడం కన్నా శాఖల్లోనే సమీక్షలు జరపగలిగితే పెద్ద మొత్తంలో కేసులు రావడమే తగ్గుతుంది.
4. పోలీసు దర్యాప్తు, అభియోగ విభాగాల బలహీనత
క్రిమినల్ కేసులలో పోలీసులు సరిగా దర్యాప్తు చేయకపోతే కేసులు తిరిగి మరోసారి విచారణకు వస్తాయి. విచారణ వ్యవస్థలో శాస్త్రీయ పద్ధతుల కొరత, ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో ఆలస్యం, అభియోగాధికారుల కొరత ఇవి అన్నీ కేసులు పరిష్కారం మరింత ఆలస్యం చేస్తున్నాయి.
5. డిజిటల్ వ్యవస్థల అమలు కాకపోవడం
ఇ-కోర్టులు, వర్చువల్ హియరింగ్స్ వంటి మార్పులు వచ్చినా, అవి పట్టణాల్లో బాగున్నా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా పూర్తిగా అమలవలేదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బలహీనత కారణంగా సాంకేతిక పరిజ్ఞానం ప్రయోజనాలు అందరికీ చేరడం లేదు.
ఇప్పటి వరకు వచ్చిన సంస్కరణలు: ఉపశమనం మాత్రమే, పరిష్కారం కాదు
భారతదేశం న్యాయ సంస్కరణలపై నిరంతర చర్చలు కొనసాగుతూనే ఉంది. లోక్ అదాలత్‌లు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, మధ్యవర్తిత్వ కేంద్రాలు, ప్రత్యేక కమర్షియల్ కోర్టులు ఇవన్నీ కొంత వరకూ ఫలితాలు ఇచ్చాయి కానీ అసలు సమస్యల భారం అలాగే ఉంది.
ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పరిమితులు
నిధుల కొరత, శాశ్వత సిబ్బంది లేకపోవడం, అనుభవజ్ఞులైన మేజిస్ట్రేట్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చాలా చోట్ల నిలకడగా పనిచేయలేకపోయాయి.
వర్చువల్ హియరింగ్స్: అవకాశాలు–అవరోధాలు
కోవిడ్ సమయంలో వర్చువల్ కోర్టులు బాగా పనిచేశాయి. కానీ వాటిని శాశ్వతంగా అమలు చేయడానికి అవసరమైన శిక్షణ, పరికరాలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవి ఇప్పటికీ అనేక జిల్లా కోర్టుల్లో లేవు.
చట్టాలలో మార్పులు సరిపోని పరిధి
క్రిమినల్ చట్టాల్లో తాజాగా జరిగిన మార్పులు (BNSS, BNS వంటి) మంచి ఆలోచనలతో వచ్చినా, అమలు చేసేది అదే పాత వ్యవస్థ. సామర్థ్యం పెంచకుండా చట్టాలు మార్చితే, సమస్యలు అదే తరహాలో కొనసాగుతాయి.
మూల సమస్యపై దృష్టి పెట్టడం లేదు
న్యాయ సంస్కరణల అసలు లోపం ఏమిటి అంటే—ఇవి లిటిగేషన్ ను తగ్గించేలా కాక ,పెంచేలా ఉన్నాయి
• వాయిదాల వల్ల న్యాయవాదులకు మరింత లాభం
• ప్రభుత్వ శాఖల్లో వివాదాన్ని పరిష్కరించాలనే బాధ్యత లేకపోవడం
• పోలీసులు దర్యాప్తును శాస్త్రీయంగా చేయాల్సిన వ్యవస్థ లేకపోవడం
• కోర్టుల్లో సరైన పరిపాలనా వనరులు లేకపోవడం
మెరుగైన* *సంస్కరణలు మాత్రమే పరిష్కారం
1. న్యాయ వ్యవస్థ సామర్థ్య విస్తరణ
శాశ్వత జ్యూడిషియల్ సర్వీస్ ఏర్పాటు చేయాలి, జిల్లా కోర్టులలో ప్రొఫెషనల్ కోర్ట్ మేనేజర్లను ఏర్పాటు చేయాలి, పరిశోధన సహాయకులను నియమించాలి, పరిపాలనా పనుల నుంచి జడ్జీలను విముక్తి చేస్తే వారు విచారణ, తీర్పు పై దృష్టి పెట్టగలరు.
2. కఠినమైన కేస్ మేనేజ్‌మెంట్
వాయిదాలకు పరిమిత సంఖ్య ఉండాలి ,ప్రతీ దశకు టైమ్‌లైన్ ఉండాలి, డిజిటల్ దాఖలాలు తప్పనిసరి చేయాలి, ఆటోమేటెడ్ స్క్రూటిని వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఈ మార్పులు ప్రక్రియల్ ఆలస్యాలను భారీగా తగ్గిస్తాయి.
3. ప్రభుత్వ లిటిగేషన్‌పై కచ్చితమైన నియంత్రణ
శాఖల మధ్య లోపాలు బయటపెడుతూ ముందస్తు సమీక్షలు నిర్వహించాలి, చిన్నపాటి కేసుల్లో మద్యవర్తిత్వం ద్వారా కేసు పరిష్కరించుకోవాలి. అనవసర అప్పీల్స్‌కు జరిమానాలు విధించాలి. ప్రభుత్వం కోర్టులకు కేసులు పంపే వేగాన్ని తగ్గిస్తే, పెండింగు కేసులు సహజంగానే తగ్గుతాయి.
4. స్థానిక వివాద పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలి
గ్రామ న్యాయాలయాలు, పట్టణ మధ్యవర్తిత్వ కేంద్రాలు, ఆన్‌లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ పద్ధతులను బలోపేతము చేస్తే ఇవి చిన్న, మధ్యస్థాయి వివాదాలనూ కోర్టుకు రాకుండానే పరిష్కరించగలవు.
5. దర్యాప్తు–అభియోగ వ్యవస్థలో సమూల మార్పు
ఫోరెన్సిక్ ల్యాబ్‌ల అభివృద్ధి, స్వతంత్ర ప్రాసిక్యూషన్ విభాగాలు, పోలీసులకు శాస్త్రీయ దర్యాప్తు శిక్షణ లేకుండా క్రిమినల్ కేసులు వేగంగా పూర్తికావడం అసాధ్యం.
న్యాయవ్యవస్థ కూడా స్వీయపరిశీలన చేయాలి
సుప్రీం కోర్టు నుంచి గ్రామ పంచాయతీ స్థాయి న్యాయవ్యవస్థ వరకు మొత్తం మీద అంతర్గత పారదర్శకత, పని పంపిణీ, పరిశీలనా వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి. కొందరి మీదే పని భారం పడడం, ఎక్కువ సెలవు రోజులు, కొంతమంది కోర్టుల్లోనే అధిక కేసులు ఉండటం ఇవి సమతుల్యతను దెబ్బతీస్తాయి.
న్యాయవ్యవస్థ ఆలస్యం ప్రజాస్వామ్యానికి ప్రమాదం
న్యాయవ్యవస్థలో ఆలస్యం కేవలం ఒక కోర్టు సమస్య కాదు పౌర హక్కులు బలహీనపడడం, పరిపాలనలో ప్రజల నమ్మకం తగ్గడం, పేదలు న్యాయం కోసం భారం మోయలేక వదిలేయడం వంటి సామాజిక దుష్పరిణామాలకు దారితీస్తుంది. న్యాయం సమయానికి అందకపోతే, రాజ్యాంగం ఇచ్చిన హక్కులే అర్థాన్ని కోల్పోతాయి.కాబట్టి, ఇది ఇక సాదాసీదా పరిపాలనా సమస్య కాదు.
ఇది దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రముఖ పాలనా సంక్షోభం.
సంస్కరణలు చిన్న చిన్న సమాధానాలతో కాదు ధైర్యమైన, బలమైన, లోతైన నిర్ణయాలతో మాత్రమే విజయవంతమవుతాయి.
