Let's talk: editor@tmv.in
న్యాయవ్యవస్థపై వివాదాస్పద అధ్యాయం.. ఎన్‌సీఈఆర్టీ క్షమాపణలు

న్యాయవ్యవస్థపై వివాదాస్పద అధ్యాయం.. ఎన్‌సీఈఆర్టీ క్షమాపణలు

Pinjari Chand
11 మార్చి, 2026

భారతదేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురైన ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని పాఠ్యాంశాన్ని పూర్తిగా తొలగిస్తున్నామని ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కోంది. దాంతో పాటు క్షమాపణలు తెలిపింది. న్యాయవ్యవస్థలో అవినీతి గురించి వివాదానికి దారి తీసిన 8వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ఉన్న ఒక అధ్యాయంపై జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్‌ రీసర్చ్‌ అండ్‌ ట్రైనింగ్–ఎన్సీఈఆర్టీ) మంగళవారం ప్రజలకు క్షమాపణలు తెలిపింది. ఆ పుస్తకాన్ని పూర్తిగా మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ‘ఎక్స్‌ప్లోరింగ్ సోసైటీ: ఇండియా అండ్ బియాండ్ ’ అనే 8వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకం (పార్ట్–2)లో ‘మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర’ అనే 4వ అధ్యాయం ఉంది. ఇందులో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో అవినీతి, కేసుల భారీ పెండెన్సీ, న్యాయమూర్తుల కొరత వంటి అంశాలు ప్రస్తావించారు. ఈ అధ్యాయం న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంటూ సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు స్వయంగా (సుమోటోగా) విచారణ ప్రారంభించింది.

ఈ కేసును సుర్యకాంత్‌ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. ఈ బెంచ్‌లో న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చీ, విపుల్ పంచోలీ ఉన్నారు. సీనియర్ న్యాయవాదులు కపిల్‌సిబల్, అభిషేక్ సింగ్ మన్వి ఈ విషయాన్ని అత్యవసరంగా విచారించాలని కోర్టులో ప్రస్తావించడంతో సుప్రీంకోర్టు దానిపై స్పందించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందిస్తూ న్యాయవ్యవస్థను ఎవరూ కించపరచడానికి అనుమతించం. ఈ పుస్తకం ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు మచ్చ పడిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ పుస్తకాన్ని ఇకపై ముద్రించడం, మళ్లీ ప్రచురించడం లేదా డిజిటల్ రూపంలో ప్రచారం చేయడం అన్నిటిపైనా పూర్తిగా నిషేధం విధించింది. ఇది ఒక తుపాకీ కాల్పుల్లా వ్యవహరించింది. సంస్థ రక్తం కారుస్తోందని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఈ పుస్తకాన్ని రూపొందించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై స్పందించిన ఎన్‌సీఈఆర్టీ అధికారులు ఈ అధ్యాయం ప్రచురించడంపై మేం నిష్కపటంగా, నిర్భందం లేకుండా క్షమాపణలు చెబుతున్నాం. మొత్తం పుస్తకాన్ని ఉపసంహరించాం. ప్రస్తుతం అది అందుబాటులో లేదని తెలిపారు.