
న్యాయమూర్తుల తీర్పును ఏఐ భర్తీ చేయలేదు: జస్టిస్ విక్రమ్ నాథ్
కృత్రిమ మేధస్సు (ఏఐ)ను సమర్థంగా ఉపయోగిస్తే న్యాయ వ్యవస్థలో కొంత పని సులభమవుతుందని, సమయాన్ని కూడా ఆదా చేయగలదని జస్టిస్ విక్రమ్‌నాథ్ తెలిపారు. అయితే న్యాయవాదుల శిక్షణ , కోర్టు అధికారిగా వారి నైతిక బాధ్యత, అలాగే న్యాయమూర్తికి అవసరమైన క్రమశిక్షణాత్మక తీర్పును ఏఐ ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తీ చేయలదని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ప్రసంగించిన ఆయన, టెక్నాలజీ ఒక నోటును తయారుచేయడంలో సహాయపడవచ్చుగానీ చట్టాన్ని సృష్టించే స్థాయికి అనుమతించకూడదని పేర్కొన్నారు. అదే సమయంలో ఏఐ దుర్వినియోగం జరిగిందన్న కారణంగా న్యాయ వ్యవస్థ దానిని పూర్తిగా తిరస్కరించకూడదని అన్నారు. ఏఐ రూపొందించిన సమాచారాన్ని నిర్లక్ష్యంగా ఉపయోగించిన ఘటనలు, ముఖ్యంగా సుప్రీం కోర్టులో కూడా జరిగినట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసలు లేని చట్టాల సూచనలు (సిటేషన్లు) లేదా ఆధారాలను ఏఐ ద్వారా తయారు చేసి సమర్పించారని చెప్పారు. ఇటువంటి తప్పుడు సిటేషన్లు కేవలం సాంకేతిక పొరపాట్లు మాత్రమే కాకుండా, న్యాయ ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీసే అంశాలని పేర్కొన్నారు. ‘ఏఐ ఒక సాధనం మాత్రమే. అది న్యాయవాది శిక్షణ పొందిన ఆలోచనను, కోర్టు అధికారిగా ఉండే నైతిక బాధ్యతను లేదా న్యాయమూర్తి తీర్పును భర్తీ చేయలదని జస్టిస్ విక్రమ్ నాథ్ మరోసారి ఉద్దాటించారు.
టెక్నాలజీ చట్టపరమైన పనులను సులభతరం చేయడంలో సహాయపడుతుందన్నప్పటికీ, అదే సమయంలో కొత్త రకాల నిర్లక్ష్యాలకు కూడా దారితీయవచ్చని ఆయన తెలిపారు. ఇది నేరాలను ఎదుర్కోవడంలో ఉపయోగపడగలదని, అయితే కొత్త నేరాలకు కూడా మార్గం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ భవిష్యత్తు కేవలం విధానాలను డిజిటల్ చేయడంలోనే ఉండదని, టెక్నాలజీని న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రాలకు అనుసంధానం చేయడంలోనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చట్ట పరిపాలన అనేది ఉపయోగించే సాధనాల ఆధునికతపై కాకుండా, వ్యవస్థల బలంపై, వాటిలో పనిచేసే వ్యక్తుల నిష్పక్షపాతంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.ఈ సమావేశంలో న్యాయవాదులు సతీష్‌చంద్ర శర్మ, అపరేశ్ కుమార్ సింగ్ కూడా ప్రసంగించారు.
