
న్యాయం కోసం బాల ఖైదీల ఎదురు చూపులు
పిల్లల భవిష్యత్తును రూపొందించాల్సిన జ్యువెనైల్ జస్టిస్ వ్యవస్థ.. ఇప్పుడు ఆ పిల్లల్నే చీకటి గదుల్లో బంధిస్తోంది. దేశంలో బాలలకు సంబంధించిన అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. చట్టాన్ని తీసుకొచ్చిన లక్ష్యాన్ని మరిచి బాల్యాన్ని బందీగా మారుస్తోంది. సరైన పర్యవేక్షణ, జువైనల్ బోర్డుల్లో జరుగుతున్న కార్యకలాపాల వివరాలు లేక 50వేలమందికి పైగా బాలలు అంధకారంలో గడుపుతున్నారు.దేశంలోని 362 జువైనల్ జస్టిస్ బోర్డుల్లో (జేజేబీ) 55 శాతం కేసులు పెండింగ్‌లో ఉండటంతో 50 వేల మందికి పైగా బాల నేరస్తులు న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గతేడాది అక్టోబర్ 31 నాటికి 1,00,904 కేసుల్లో సగం కంటే ఎక్కువ కేసులు పరిష్కారం కాలేదని ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) తాజా నివేదిక బయటపెట్టింది. సుమారు 28 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సేకరించిన వివరాల్లో ఒడిశాలో 83 శాతం, కర్ణాటకలో 35 శాతం పెండింగ్ ఉన్నట్లు నివేదిక బయటపెట్టింది.
మారని పరిస్థితులు
ప్రతి జేజేబీలో సగటున 154 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగింట ఒక బోర్డు (25 శాతం) పూర్తి బెంచ్ లేకుండానే నడుస్తోంది. 2023లోనే 40,036 మంది బాల నేరస్తులు అరెస్టు అయ్యారు. వీరిలో 75 శాతం మంది 16–18 ఏళ్ల టీనేజీ యువతీ, యువకులే. నిర్భయ కేసు తర్వాత 2015లో వచ్చిన జ్యువెనైల్ జస్టిస్ చట్టానికి పదేళ్లు నిండిపోయాయి. కానీ గ్రౌండ్ లెవెల్‌లో ఏం మారలేదు? జడ్జిల ఖాళీలు, పరిశీలనా గృహాల తనిఖీలు, సరైన డేటా లేకపోవడం, రాష్ట్రాల మధ్య భారీ అసమానతలు ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ రిపోర్టు బయటపెట్టిన దారుణ నిజాల్లో 30 శాతం జేజేబీలకు లీగల్ ఎయిడ్ క్లినిక్ లేకపోవడం.
14 రాష్ట్రాలు + జమ్మూ కాశ్మీర్‌లో 18 ఏళ్లు దాటిన బాల నేరస్తుల కోసం ‘ప్లేసెస్ ఆఫ్ సేఫ్టీ’ ఒక్కటీ లేవు.
166 చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో 1,992 తప్పనిసరి తనిఖీలు జరగాల్సి ఉండగా... కేవలం 810లో మాత్రమే జరిగాయి
292 జిల్లాల్లో బాలికల కోసం 40 ప్రత్యేక గృహాలు కేవలం మాత్రమే ఏర్పాటు చేశారు.
డేటానే లేదు... పారదర్శకతకు చోటెక్కడిది?
దేశంలో జ్యువెనైల్ జస్టిస్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో డేటా బేస్ లేదు. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ లాంటిది జేజేబీలకు లేదు. ఈ నివేదిక తయారీకి 250కిపైగా ఆర్‌టీఐ దరఖాస్తులు దాఖలు చేయాల్సి వచ్చింది. వచ్చిన 500 సమాధానాల్లో.. 11 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 24 శాతం వాటికి సమాధానమే రాలేదు. 29 శాతం కేసులు ఇతర శాఖలకు బదిలీ, కేవలం 36 శాతం మాత్రమే ఉపయోగకరమైన సమాచారం ఇచ్చారు.
‘ఈ వ్యవస్థ సమాచారం ప్రవాహంపైనే నడుస్తుంది. కానీ అధికారులు కావాలనే డేటా ఇవ్వడం లేదు. పర్యవేక్షణ సంస్థలు డిమాండ్ చేయడం లేదు. చెల్లాచెదురు డేటాతో పర్యవేక్షణ అప్పుడప్పుడే బాధ్యత నిర్వహణ గాలికి వదిలేసినట్టయింది’ అని ఇండియా జస్టిస్ రిపోర్ట్ చీఫ్ ఎడిటర్ మాజా దారువాలా ధ్వజమెత్తారు. పిల్లల భవిష్యత్తు నెలలు, సంవత్సరాల తరబడి ఆలస్యమవుతోంది. నిర్భయ కేసు తర్వాత ప్రజల ఆగ్రహంతో వచ్చిన చట్టం.. ఇప్పటికీ కాగితంపైనే మిగిలిపోయిందా? సుప్రీంకోర్టు, కేంద్ర మహిళా-శిశు సంక్షేమ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నివేదికను కనీసం ఒక్కసారైనా కళ్లారా చూస్తాయా? లేక మరో ఫైలు మరో డెస్క్ డ్రాయర్‌లో ఇమిడిపోతుందా? అన్నట్లు తయారైందన్నారు.
జువైనల్ జస్టిస్–2015 చట్టం ప్రకారం జేజేబీలు బాల నేరస్తుల కేసులను సాధ్యమైనంతగా తక్షణమే, వేగంగా పరిష్కరించాలి కానీ వాస్తవంగా ఇది కేసు కేటాయింపు, నేర స్వభావం, రీహబిలిటేషన్ ప్రొసీడింగ్స్ ఆధారంగా ఉంటుంది.
చట్టం ప్రకారం ఉన్న సూచనలు
జూవైనల్ అరెస్ట్ అయిన వెంటనే సెక్షన్ 8,9 ప్రకారం పిల్లల హక్కులను, తక్షణ రక్షణ అవసరాలను చర్చించడానికి మూడు రోజులలో
జేజేబీ ముందు హాజరు పరచాలి. అలాగే బాల నేరస్తుల కేసులు సాధారణంగా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చట్టం ఉద్దేశిస్తుంది. 16–18 ఏళ్ల బాల నేరస్తులపై ప్రత్యేక దారుణ నేరాలు (మరణం/భారీ శిక్ష) కేసులు ఎడల్ట్ కోర్ట్ నిర్ణయం తరువాత తీసుకుంటారు. జూవైనల్ నేరస్తుల కేసులు సాధారణంగా సంబంధిత విచారణ 1–3 నెలల్లో ముగించాలని ఉన్నప్పటికీ చట్టంలో ఇన్ని రోజుల్లోపు పూర్తి చేయాలనే డెడ్ లైన్ లేదు.
