Let's talk: editor@tmv.in
న్యాయం కోరినందుకే పప్పు యాదవ్‌ అరెస్ట్‌: రాహుల్‌ గాంధీ

న్యాయం కోరినందుకే పప్పు యాదవ్‌ అరెస్ట్‌: రాహుల్‌ గాంధీ

Pinjari Chand
8 ఫిబ్రవరి, 2026

పాట్నాలోని హాస్టల్‌లో నీట్‌ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థిని మృతి కేసులో న్యాయం కోరినందుకే పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్‌ను అరెస్టు చేశారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆయన విమర్శించారు. ఎక్స్‌ వేదికగా స్పందించిన రాహుల్‌ గాంధీ, ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరగాలని కోరిన ఎంపీ పప్పు యాదవ్‌ను భయపెట్టేందుకు, మాట్లాడకుండా ఉండేందుకే ఈ అరెస్ట్‌ చేశారని అన్నారు. ఈ కుమార్తెకు న్యాయం కావాలంటూ నిలబడినవాడు పప్పు యాదవ్‌. ఆయన అరెస్ట్‌ ప్రజల గొంతును అణిచివేసే రాజకీయ కక్ష సాధింపు చర్య అని వ్యాఖ్యానించారు. 1995 నాటి భూవివాద కేసులో కోర్టుకు హాజరు కాలేదనే కారణంతో పప్పు యాదవ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. తన భద్రతపై అనుమానాలు వ్యక్తం చేసిన పప్పు యాదవ్‌, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లనని, అవసరమైతే హౌస్‌ అరెస్ట్‌ చేయాలని వ్యాఖ్యానించారు. ఈ ఘటనను మళ్లించేందుకు, బాధిత కుటుంబాన్ని వేధించేందుకు బీజేపీ–ఎన్‌డీఏ ప్రయత్నిస్తోందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నా ప్రభుత్వం కళ్లుమూసుకుని కూర్చోందని విమర్శించారు. ఇది రాజకీయ అంశం కాదని, న్యాయం, బీహార్‌ కుమార్తెల గౌరవం, భద్రతకు సంబంధించిన ప్రశ్న అని స్పష్టం చేశారు.

అన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయి

కాంగ్రెస్‌ నేత, వాయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి దర్యాప్తు, చర్యల వరకు అన్నీ అనుమానాస్పదంగా మారాయని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు. హత్రాస్‌, ఉన్నావో, అంకిత భండారి ఘటనల మాదిరిగానే మహిళలపై దాడుల కేసుల్లో బీజేపీ ప్రభుత్వాలు నిందితుల పక్షానే నిలుస్తున్నాయని ఆమె విమర్శించారు. బాధిత కుటుంబం దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేయడంతో బీహార్‌ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సిఫారసు చేసింది. పోలీసుల ప్రకారం, చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందగా, లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలను వైద్యులు ఇంకా నిర్ధారించలేదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేశారు.