
న్యాయం కావాలంటే నిర్బంధమా?
రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్‌ఆర్) భూసేకరణ అంశంపై తమ గోడు చెప్పేందుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలవడానికి వెళ్తున్న రైతులను ఎందుకు అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రశ్నించారు. సోమవారం వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలానికి చెందిన ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసేందుకు వెళ్లగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మెతుకు ఆనంద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. ."ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని, ప్రజలు తమ సమస్యలు ప్రజాప్రతినిధులకు చెప్పుకునే హక్కును సైతం ఈ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. రైతులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఇది పౌర హక్కుల ఉల్లంఘన అని ఫైర్ అయ్యారు. .
రైతుల అంగీకారంతోనే భూ సేకరణ జరపాలి
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒరిజినల్ అలైన్‌మెంట్ ప్రకారం రైతుల పూర్తి అంగీకారంతో మాత్రమే భూ సేకరణ జరపాలని వివరించారు. రైతులను వెంటనే విడుదల చేయాలని జిల్లా ఎస్పీని ఫోన్‌లో కోరారు. సబితా ఇంద్రారెడ్డితో రైతులను మాట్లాడించడంతో వారికి కొంత భరోసా లభించినట్లు తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డి తన సొంత అజెండా నెరవేర్చేందుకు భూసేకరణను బలవంతంగా అమలు చేస్తున్నాడని మండిపడ్డారు. .రైతుల అంగీకారమే లేకుండా జీవోలు జారీ చేసి భూములు లాక్కోవడం అన్యాయమని విమర్శించారు. ఇది ఇందిరమ్మ పాలన అంటే, రైతులకు బేడీలు వేసే పాలనగా మారిందా? అంటూ ప్రశ్నించారు.
అలాగే రైతుల కోసం పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను కూడా అరెస్టు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని విమర్శించారు. ఈ దుర్మార్గ ప్రభుత్వానికి ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, నాయకులు భరత్ రెడ్డి, విజయ్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
