
నోయిడా టెకీ మృతి కేసు: మరో ఇద్దరు బిల్డర్లు అరెస్టు
నీటితో నిండిన గోతిలో కారు పడిపోవడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందిన ఘటనలో పోలీసులు మరో ఇద్దరు బిల్డర్లను గురువారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని రవీ బన్సల్ (ఫరీదాబాద్ నివాసి), సచిన్ కర్న్వాల్ (ఘాజియాబాద్ నివాసి)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ లోటస్ గ్రీన్స్ రియల్ ఎస్టేట్ సంస్థతో సంబంధం ఉన్నవారని, అయితే సంస్థలో వారి హోదా ఏంటన్నది ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు చెప్పారు.ఈ అరెస్టులు నాలెడ్జ్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో భాగంగా జరిగాయి. నిందితులపై భారతీయ న్యాయ్ సంహిత్ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
జనవరి 16–17 మధ్య రాత్రి, యువరాజ్ మెహతా (27) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సెక్టార్–150లోని తన ఇంటికి తిరిగివెళ్తూ, లోటస్ గ్రీన్స్ నిర్మాణ స్థలానికి సమీపంలో నీటితో నిండిన గోతిలో కారు పడిపోవడంతో మృతి చెందాడు. గురుగ్రామ్‌లో పనిచేస్తున్న యువరాజ్ దాదాపు రెండు గంటల పాటు కారులోపల, ఆ తర్వాత బయట చిక్కుకుని సహాయం కోసం వేడుకున్నప్పటికీ, చివరకు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు, లోటస్ గ్రీన్స్‌తో పాటు ఎమ్‌జెడ్ విజ్‌టౌన్ ప్లానర్స్ సంస్థలపై కేసు నమోదు చేశారు. ఇదివరకే ఈ కేసులో భాగంగా ఎమ్‌జెడ్ విజ్‌టౌన్ ప్లానర్స్ డైరెక్టర్ అభయ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేయగా, అతన్ని బుధవారం జైలుకు పంపించారు. అదేవిధంగా, పర్యావరణ నిబంధనలు, కాలుష్య నియంత్రణ చట్టాల ఉల్లంఘనతో పాటు నిర్మాణ స్థలంలో తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరించారన్న ఆరోపణలపై రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన ఐదుగురు అధికారులపై పోలీసులు మరో ప్రత్యేక ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తడంతో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసి కేసును విచారిస్తోంది.
