Let's talk: editor@tmv.in
నోబెల్ రాని శాంతి దూత

నోబెల్ రాని శాంతి దూత

FL - TRND
11 అక్టోబర్, 2025

ప్రపంచం తుపాకీతో వయలెన్స్‌కి పాల్పడుతుంటే.. ఒక మనిషి సైలెన్స్‌తో యుద్ధాన్ని ఆపాడు. ప్రపంచం రక్తంతో విజయాన్ని వెతుకుతుంటే.. ఆయన మాత్రం ప్రపంచాన్ని ప్రేమతో గెలిచాడు. ఆయన కత్తి పట్టలేదు..తుపాకీ కూడా పట్టలేదు.. కానీ బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని మాత్రం గజగజా వణికించాడు. ఆయన మాటలు బాంబులా కాదు, గుండెల్లో మెల్లగా నిజాల్లా పేలాయి. అహింస ఆయన శక్తి.. సత్యం ఆయన ధర్మం.. కరుణ ఆయన మార్గం. ఈ భూమిపై ఎందరో నాయకులు పుట్టారు కానీ.. మరో గాంధీ పుట్టలేదు. మానవజాతికి శాంతి పాఠాలు నేర్పిన ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా మాట్లాడుకోవాల్సింది ఉంటుంది. అయితే గాంధీ గురించి ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ చర్చకు కారణం అవుతూనే ఉంటుంది. శాంతి స్వరూపుడైన మహాత్ముడికి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇవ్వలేదు? ఐదుసార్లు ఈ అవార్డుకు నామినేట్ అయిన గాంధీకి ఈ ప్రైజ్ ఎందుకు దక్కలేదు? 1948లో వచ్చిన చివరి అవకాశం గాడ్సే వల్లే చేజారిందా? ఈ ప్రశ్నల వెనుక అంతులేని చరిత్ర ఉంది. గుండె లోతుల్లో దాగి ఉన్న బాధ కూడా ఉంది.

గాంధీ జీవితమంతా ఒక సందేశమనే చెప్పాలి. ఆయన అహింసను మాత్రమే నమ్మారు. అదే అంతిమ ధైర్యమన్నది గాంధీ తత్వం. ఉప్పు సత్యాగ్రహం నుంచి క్విట్‌ ఇండియా ఉద్యమం వరకు ఆయన నడకలోని ప్రతి అడుగు చరిత్రగా మారింది. ఆయుధాలు లేకుండానే ఆయన యుద్ధం చేశారు. విజయం కూడా సాధించారు. ఆయన ఆలోచనలతో ప్రపంచం మారిపోయింది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా, దలైలామా లాంటివారు ఆయన ఆత్మను తమలో అనుభవించారు. ఇలా గాంధీని ప్రపంచం శాంతికి ప్రతీకగా గౌరవించినా.. ఆయనకు నోబెల్ బహుమతి మాత్రం దక్కలేదు. కారణాలు ఎన్నో చెప్పారు. కొందరు ఆయన పోరాటం జాతీయ విముక్తి కోసం అని, అంతర్జాతీయ శాంతి కోసం కాదని వాదించారు. ఇంకొందరు ఆయన ఆచరణ పద్ధతులు యూరప్‌కు అర్థం కాలేదని చెప్పారు. అప్పటి నోబెల్ కమిటీ గాంధీని ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే చూసింది.. ఒక శాంతి దూతగా కాదు.

1947 ఆగస్టు 15న భారత్‌కు బ్రిటీష్‌ పాలన నుంచి విముక్తి వచ్చింది. అయితే దేశం మాత్రం రెండు ముక్కలైంది. హిందువులు, ముస్లింల మధ్య అగ్నిజ్వాలలు రగిలాయి. గాంధీ ఆ అగ్నిలో అడుగుపెట్టారు. హింస ఆగాలని ఆయన తిండి మానేశారు. మత భేదం మసకబారాలని ఆయన అహింసా పద్ధతిలో నిరసన దీక్షకు దిగారు. కానీ అల్లకల్లోలం ఆగలేదు. నోబెల్ కమిటీకి అప్పుడు వచ్చిన వార్తలు ఆయనపై తప్పుడు ప్రభావాన్ని చూపించాయి. దేశంలో హింస కొనసాగుతుండగా గాంధీకి శాంతి బహుమతి ఇవ్వడం తగదని వారు అనుకున్నారు. శాంతి కోసం ప్రాణాలు అర్పిస్తున్న మనిషి కనిపిస్తున్నా.. ఆయన చుట్టూ ఉన్న అల్లర్లు గాంధీ కాంతిని ఆవరించాయి.

ఇదే సమయంలో 1948లో చివరిసారి ఆయన పేరు నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్ అయ్యింది. ఈసారి అయితే అవార్డు ఆయన చేతికి చేరుతుందేమో అన్న ఆశ జ్వలించింది. కానీ జనవరి 30న, ఆ ఆశను నాథూరాం గాడ్సే బుల్లెట్లు ఛిద్రం చేశాయి. గాంధీ రక్తంతో మునిగిన ఆ మట్టిలో శాంతి కూడా కన్నీరు పెట్టుకుంది. గాంధీతో పాటు నోబెల్ అవకాశమూ అంతమైంది. ఆ సంవత్సరం నోబెల్ కమిటీ చేసిన ప్రకటన చూస్తే గాంధీ నోబెల్‌ శాంతి బహుమతిని మిస్‌ అయ్యారని అర్థం చేసుకోవచ్చు. అవార్డు అందుకోవడానికి బతికి ఉన్న అభ్యర్థి లేరని కమిటీ ప్రకటించింది. అప్పుడు నిబంధనల ప్రకారం మరణానంతరం బహుమతులు ఇవ్వకూడదు. అందుకే గాంధీకి దక్కాల్సిన బహుమతి గాల్లో కలిసిపోయింది.

కాలం గడిచాక నోబెల్ కమిటీ తలవంచింది. తమ అతిపెద్ద తప్పిదం గాంధీకి అవార్డు ఇవ్వకపోవడమేనని ఒప్పుకుంది. కానీ గాంధీ ఆత్మను అవార్డుతో లెక్కగట్టగలమా? ఆయన ప్రజల హృదయాలను గెలిచారు. గాంధీ పాఠాలు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కంఠంలో వినిపించాయి.. నెల్సన్ మండేలా హృదయంలో మోగాయి. ప్రతి శాంతి ప్రియుడి మార్గంలో ఆయన ఆత్మ నడిచింది. గాడ్సే బుల్లెట్లు గాంధీని చంపాయి కానీ ఆయన ఆలోచనలను కాదు. ఆ ఆలోచనలు ఇప్పటికీ ప్రపంచానికి ఆదర్శమే. ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా శాంతి రూపంలో తిరుగుతున్న గాంధీ ఆలోచనలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. గాంధీకి నోబెల్ రాలేదు కానీ.. శాంతి అనే ఆత్మ ఆయన పేరుతో శాశ్వతమైంది. నోబెల్ ఒక బహుమతి మాత్రమే... గాంధీ మాత్రం ఒక ఎమోషన్. అవార్డులను మనుషులే సృష్టిస్తారు కానీ.. మహాత్ములు మాత్రం ప్రజల మనసుల్లో పుడతారు. గాంధీ అలానే పుట్టారు.. దటీజ్ మహాత్మ..!

నోబెల్ రాని శాంతి దూత - Tholi Paluku