Let's talk: editor@tmv.in
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను - హోం మంత్రి అనిత సమీక్ష

నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను - హోం మంత్రి అనిత సమీక్ష

Dantu Vijaya Lakshmi Prasanna
30 నవంబర్, 2025

నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను నేపధ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు . తుపాను తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలని అలెర్ట్ చేయాలని అనిత అన్నారు. సహయక చర్యలకు ఎస్ డిఆర్ఎఫ్, ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు పంపించాలని అనిత ఆదేశించారు.

నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో మొదలైన 'దిత్వా' తుఫాను ప్రస్తుతానికి కారైకాల్ కి 150 కి,మీ, పుదుచ్చేరికి 250 కి.మీ, చెన్నైకి 350కి.మీ దూరంలో కేంద్రీకృతమైఉంది. గడిచిన 6 గంటల్లో 10కి.మీ వేగంతో కదిలిన తుపాన్ ఆంధ్ర వైపు వస్తుంది. నేడు, రేపు ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్ష సూచన ఉందని అధికారులు హో౦ మంత్రికి వివరించారు.

జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి

తుఫాను నేపద్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్లను అనిత ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రిందిస్థాయి అధికారులకు, ప్రజలకు తెలియజేయాలి, క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అలెర్ట్ గా ఉండాలి. కంట్రోల్ రూమ్‌లను 24/7 కొనసాగించాలి అని అనిత అన్నారు.

విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రందించాలన్నారు.

శిధిలావస్థలో ఉన్న ఇళ్ళల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలి. విరిగిన చెట్లు తొలగించడం , విద్యుత్తు అంతరాయం జరిగితే పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా ఏర్పాటు చేయాలి. భారీవర్షాలు కురుస్తున్నపుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బలమైన ఈదురుగాలుల వీచేప్పుడు చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండకండి అంటూ హోంమంత్రి అనిత ప్రకటన విడుదల చేశారు.

అలాగే బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను - హోం మంత్రి అనిత సమీక్ష - Tholi Paluku