
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని ఆయన వెల్లడించారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది.
అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సోమవారం (నవంబర్ 17) వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆయన హెచ్చరించారు.
రెండు రోజుల పాటు భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో (నవంబర్ 17, 18 తేదీల్లో) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం (నవంబర్ 17, 2025) ముఖ్యంగా నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రకాశం, కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చు. ఇక మంగళవారం (నవంబర్ 18, 2025) నాటికి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది, అయితే ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా.
మరో అల్పపీడనం, రైతులకు ముందస్తు సూచన
అంతేకాకుండా నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం, ఈ రెండో వ్యవస్థ ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ముందస్తు సమాచారం దృష్ట్యా, రైతులు తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ ప్రత్యేకంగా సూచించారు.
