Let's talk: editor@tmv.in
నైపుణ్య మార్పిడితో ఉమ్మడి పురోగతికి అడుగులేద్దాం: మంత్రి శ్రీధర్ బాబు

నైపుణ్య మార్పిడితో ఉమ్మడి పురోగతికి అడుగులేద్దాం: మంత్రి శ్రీధర్ బాబు

Gaddamidi Naveen
5 నవంబర్, 2025

నైపుణ్య మార్పిడితో పరస్పర అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో అంతర్జాతీయ భాగస్వామ్యానికి సిద్ధమవుతోంది. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, క్రీడలు, సంస్కృతి తదితర రంగాల్లో క్యూబాతో ద్వైపాక్షిక సహకారం కుదుర్చుకునేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.

మంగళవారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా, ఫస్ట్ సెక్రటరీ మిక్కీ డియాజ్ పెరెజ్‌లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ – క్యూబా మధ్య నైపుణ్య మార్పిడి, ద్వైపాక్షిక సహకారం అవకాశాలపై విస్తృత చర్చ జరిగింది.

ప్రధాన రంగాలలో సహకారంపై చర్చ

శ్రీధర్ బాబు మాట్లాడుతూ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్నోవేషన్, అగ్రికల్చర్, సస్టైనబుల్ ఫార్మింగ్, స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్, కల్చర్ రంగాల్లో రెండు ప్రభుత్వాలు కలిసి పని చేసే విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వివరించారు.

జీనోమ్ వ్యాలీ, స్టార్టప్‌లకు మార్గనిర్దేశం

స్టార్టప్ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని, టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్ వంటి సంస్థల ద్వారా కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. ఈ సంస్థలు క్యూబా యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం అందించగలవని చెప్పారు.ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్, ఫార్మా రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ డేటా అనలిటిక్స్‌లో తెలంగాణ–క్యూబా కలిసి పనిచేయవచ్చని శ్రీధర్ బాబు సూచించారు. ప్రపంచంలోని టాప్-7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా గుర్తింపు పొందిన తెలంగాణ జీనోమ్ వ్యాలీని సందర్శించాలని ఆయన క్యూబా ప్రతినిధులను ఆహ్వానించారు.

క్రీడల్లో క్యూబా నైపుణ్యం అవసరం

క్యూబా దేశం బాక్సింగ్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉంది. ఈ క్రీడల్లో క్యూబాకు ఉన్న నైపుణ్యాన్ని తెలంగాణకు అందించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.

ఈ సందర్భంగా క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణలను స్వీకరించడంలో, ఇన్నోవేషన్ ఆధారిత అభివృద్ధిని సాధించడంలో తెలంగాణ చూపిస్తున్న చురుకుదనం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందన్నారు. క్యూబా కూడా ఇలాంటి రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉందని తెలిపారు.

నైపుణ్య మార్పిడితో ఉమ్మడి పురోగతికి అడుగులేద్దాం: మంత్రి శ్రీధర్ బాబు - Tholi Paluku