
‘నైనీ బొగ్గు బ్లాక్’ టెండర్‌పై అబద్ధపు కథనాలు: డిప్యూటీ సీఎం
సింగరేణి నైనీ బొగ్గు బ్లాక్ టెండర్‌కు సంబంధించి ఒక ప్రధాన దినపత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అసత్య ఆరోపణలు, కట్టుకథలతో నిండిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సింగరేణి కాలరీస్‌కు చెందిన బొగ్గుగనులు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకలని, అవి రాష్ట్రానికి చెందిన అమూల్యమైన ప్రజా ఆస్తులని స్పష్టం చేశారు. వాటిని కాపాడటం, భవిష్యత్ తరాలకు భద్రపరచడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, అదే తన ముందున్న ఏకైక లక్ష్యమని తెలిపారు.
తాను రాజకీయాల్లోకి వచ్చినది వ్యక్తిగత సంపద కోసమో.. వ్యాపార సామ్రాజ్యాల నిర్మాణం కోసమో కాదని, సమాజంలోని వనరులు అన్ని వర్గాలకు సమానంగా అందేలా చేయడమే తన ఆశయమని పేర్కొన్నారు. దోపిడీ చేసే శక్తులను రక్షించేందుకు లేదా వారి తరఫున మాట్లాడేందుకు తాను రాజకీయాల్లో లేనని స్పష్టం చేశారు. తన జీవితం పూర్తిగా పారదర్శకమైందని, ఎవరికైనా లాభం చేకూర్చేందుకు తన పదవిని ఉపయోగించానని రాయడం పూర్తిగా అసత్యమని ఆయన అన్నారు. నేను వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడిని కాబట్టి ఆయనపై ఉన్న కోపం నామీద చూపిస్తున్నారు అని అన్నారు.
సింగరేణి టెండర్ విషయానికి వస్తే, టెండర్‌ను పిలిచింది సింగరేణి సంస్థేనని, టెండర్ షరతులు నిర్ణయించేది సింగరేణి బోర్డేనని, మంత్రి కాదని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా కథనాలు రాయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. టెండర్‌లో ‘సైట్ విజిట్’ అంశాన్ని కూడా వక్రీకరించారని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్‌లో, ముఖ్యంగా క్లిష్ట ప్రాంతాల్లో పనులు చేపట్టే సందర్భంలో టెండర్‌కు ముందు సైట్ విజిట్ అనేది సాధారణ ప్రక్రియేనని, పారదర్శకత కోసమే ఇది అమలులో ఉంటుందని ఆయన వివరించారు.
ప్రభుత్వం నిజాయితీగా ఉండటమే కాకుండా, ప్రజలకు కూడా అలా కనిపించాలనే ఉద్దేశంతో సింగరేణి టెండర్ షరతులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించామని తెలిపారు. సింగరేణి మేనేజ్‌మెంట్, బోర్డుతో చర్చించి, ఆ టెండర్‌ను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వ పీఎస్‌యూ ప్రమాణాలకు అనుగుణంగా కొత్తగా టెండర్ పిలవాలని ఆదేశాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు.
ఇప్పుడే టెండర్ పిలిచిన దశలో ఉండగా, ఇంకా ఎవరూ పాల్గొనని పరిస్థితిలో ‘ఎవరికో ఇవ్వడానికి టెండర్ వేశారు’ అనే ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఆస్తులపై దోపిడీదారుల కన్ను పడనివ్వబోనని, అటువంటి శక్తులకు తాను ఎప్పటికీ భయపడనని ఆయన తేల్చి చెప్పారు.
మీడియా సంస్థల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు, సంబంధాలు వారి మధ్యే ఉండాలి. వాటి కోసం రాష్ట్ర పాలనను, ప్రభుత్వాన్ని, అధికారులు లేదా మంత్రులను లాగడం ఎవరికీ అనుమతించేది కాదు.ఏ ఛానల్‌కైనా, ఏ పత్రికకైనా కట్టుకథలు వండి కథనాలు రాసే హక్కు లేదు. ఇతర వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ఎవరికీ అధికారం లేదు. ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఈ రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం నిజాయితీగా పనిచేస్తున్నారు అని తెలిపారు.
చిల్లర రాజకీయ ప్రయోజనాల కోసం కట్టుకథలు సృష్టించి, విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు విజయవంతం కావు. భట్టి విక్రమార్క 40 సంవత్సరాలుగా సభలో, సభ బయట ఈ సమాజం కోసం పోరాడుతున్న వ్యక్తి. ఇటువంటి నీచమైన, దిగజారిన రాజకీయాలకు భయపడే వ్యక్తి కాదు అని ఆయన పేర్కొన్నారు.
