
నైజీరియా గనిలో విషాదం.. విషవాయువు లీకై 37 మంది మృతి
నైజీరియాలోని ఓ గనిలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం 37 మంది ప్రాణాలను బలితీసుకుంది. దేశంలోని ఉత్తర మధ్య ప్రాంతంలో ఉన్న ఓ గనిలో ఒక్కసారిగా విషవాయువు లీక్ కావడంతో ఈ విషాదం నెలకొంది. ఈ ఘటనలో మరో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్లాటూ రాష్ట్రంలోని వాసే ఏరియాలో ఉన్న కంపానీ జురాక్ కమ్యూనిటీలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు ప్రతినిధి ఆల్ఫ్రెడ్ అలాబో వెల్లడించారు.
విషవాయువులతో ఊపిరాడక ప్రాణాలు విలవిల
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. గనిలో పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా లెడ్ ఆక్సైడ్ (సీసం ఆక్సైడ్)తో పాటు సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు విడుదలయ్యాయి. గని లోపల సరైన గాలి వెలుతురు (వెంటిలేషన్) లేకపోవడంతో ఆ విషవాయువులు వేగంగా విస్తరించి లోపల ఉన్న కార్మికులకు ఊపిరాడకుండా చేశాయి. గాలిలో కలిసిన ఈ విషపూరిత వాయువుల ప్రభావం వల్ల కార్మికులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, వారి వారి మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అక్రమ మైనింగ్‌పై నిఘా.. గని మూసివేత
ఈ ఘటనపై నైజీరియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రమాదం జరిగిన గనిని తక్షణమే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. వాయువు ఎలా లీక్ అయింది? దానికి గల కారణాలేంటి? అనే కోణంలో సమగ్ర విచారణకు ఆదేశించింది. ఘటనా స్థలంలో కార్మికులు అక్కడ వెలువడుతున్న పొగలు విషపూరితమైనవని తెలియక పనులు కొనసాగించడమే ప్రాణనష్టానికి ప్రధాన కారణమని ఆ దేశ గనుల శాఖ మంత్రి డెలే అలాకే పేర్కొన్నారు.
ప్రస్తుతానికి ఆ గనిలో ఏ ఖనిజాన్ని వెలికితీస్తున్నారనేది స్పష్టంగా తెలియలేదు. అలాగే ఆ గని చట్టబద్ధంగా నడుస్తుందా లేదా అనేది కూడా విచారణలో తేలాల్సి ఉంది. నైజీరియాలో గత కొన్నేళ్లుగా అక్రమ బంగారు గనుల వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, ప్రభుత్వం అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తోంది.
