Let's talk: editor@tmv.in
నైజీరియాలో 303 మంది విద్యార్థుల అపహరణ

నైజీరియాలో 303 మంది విద్యార్థుల అపహరణ

Pinjari Chand
23 నవంబర్, 2025

ఉత్తర-మధ్య నైజీరియాలోని నైజర్ రాష్ట్రంలోని కాథలిక్ సంస్థ అయిన సెయింట్ మేరీస్ స్కూల్‌పై జరిగిన దాడిలో మొత్తం 303 మంది పాఠశాల విద్యార్థులు, 12 మంది ఉపాధ్యాయులను ముష్కరులు అపహరించారని నైజీరియా క్రిస్టియన్ అసోసియేషన్ శనివారం తెలిపింది. అంతకుముందు 215 మంది పాఠశాల విద్యార్థుల ఉన్నారని తెలిపింది. కానీ ఈ సంఖ్య మరింతగా పెరిగింది.

మొదట 215 మంది విద్యార్థులనే అపహరించారని తెలిపినా, పునర్విభజన, హాజరు నమోదు, తుది లెక్కింపు అనంతరం సంఖ్యను సవరించినట్లు సీఏఎన్ నైజర్‌ రాష్ట్ర చైర్మన్‌ మోస్ట్‌ రెవరెండ్‌ బులుస్‌ దౌవా యోహన్నా తెలిపారు. దాడి సమయంలో పారిపోవడానికి ప్రయత్నించిన మరో 88 మంది విద్యార్థులను కూడా దుండగులు వెంటాడి తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు. ఎత్తుకెళ్లిన పిల్లల వయస్సు 10 నుంచి 18 సంవత్సరాల మధ్యగా ఉంటుందని తెలిపారు.

నాలుగు రోజుల ముందు

ఈ సంఘటనకు నాలుగు రోజుల ముందు పొరుగు రాష్ట్రం కెబ్బీలోని మాగా పట్టణంలో 25 మంది విద్యార్థులు అపహరణకు గురవడం నైజీరియాలో పాఠశాలల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. రెండు దాడుల ప్రదేశాల మధ్య దూరం 170 కిలోమీటర్లు మాత్రమే.

ఈ కిడ్నాప్‌లకు బాధ్యత వహిస్తున్నట్లు ఇంకా ఏ గ్రూపు ప్రకటించలేదు. పిల్లలను రక్షించడానికి స్థానిక వేటగాళ్లతో పాటు వ్యూహాత్మక బృందాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. పాఠశాలలు ‘లక్ష్యాన్ని వెంటనే ఆకర్షించే ప్రదేశాలు’ అన్న భావనతో ఆర్మ్డ్‌ గ్యాంగులు ఇలాంటి దాడులు పెంచుతున్నాయని భద్రతా సంస్థలు చెబుతున్నాయి.

ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది—సీఏఎన్

భద్రతా కారణాల వల్ల ఆ ప్రాంతంలోని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఆ విషయాన్ని వక్రీకరించడం మాత్రమే అని యోహన్నా ఖండించారు. మాకు ఎటువంటి సర్క్యులర్‌ రాలేదు. తర్వాత మాపై నింద మోపేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది అని ఆయన అన్నారు. కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు.

నైజర్‌ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు మూత

ఈ దాడి నేపథ్యంలో నైజర్‌ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను వెంటనే మూసివేసింది. ప్రాణాలు–ఆస్తుల రక్షణ దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నాం. ఈరోజు నుంచే క్రిస్మస్‌ సెలవులుగా భావించొచ్చు అని గవర్నర్‌ ఉమర్‌ బాగో తెలిపారు. భద్రతా అధికారులతో సమావేశమైన తర్వాత శనివారం విలేకరులకు తెలిపారు. 10 రాష్ట్రాల్లోని 37 శాతం పాఠశాలల్లో మాత్రమే ముప్పులను గుర్తించడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఉన్నాయని యునిసెఫ్ గత సంవత్సరం తెలిపింది.

ట్రంప్‌ ఆరోపణల మధ్య

నైజీరియాలో క్రైస్తవులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యల మధ్య ఈ దాడి చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. కానీ నైజీరియాలో దాడులు క్రైస్తవులు–ముస్లింలను ఇద్దరినీ ప్రభావితం చేస్తున్నాయని స్థానిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా కెబ్బీ దాడి కూడా ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతంలోనే జరిగింది. నైజీరియా జాతీయ భద్రతా సలహాదారు నుహు రిబాదు శుక్రవారం అమెరికాలో పర్యటిస్తున్న వేళ, అక్కడ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్‌ను కలిసిన సమయంలో ఈ దాడి జరిగింది.

నైజీరియాలో 303 మంది విద్యార్థుల అపహరణ - Tholi Paluku