
నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీలకు హైకోర్టు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులకు హైకోర్టు నోటీసులు పంపింది. ఇటీవల ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఛార్జ్‌షీట్‌పై విచారణ చేపట్టేందుకు నిరాకరించిన ట్రయల్ కోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం స్పందించింది. ఈ పిటిషన్‌పై గాంధీలు సహా ఇతర నిందితులకు నోటీసులు జారీ చేసింది.
జస్టిస్ రవీందర్ దుడేజా నేతృత్వంలోని ధర్మాసనం, ఈడీ ప్రధాన పిటిషన్‌తో పాటు డిసెంబర్ 16న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును నిలిపివేయాలన్న ఈడీ దరఖాస్తుపై కూడా ప్రతివాదుల నుంచి సమాధానం కోరింది. ఈ కేసు తదుపరి విచారణను 2026 మార్చి 12కు వాయిదా వేసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ సంస్థ, డోటెక్స్ మెర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్, సునీల్ భండారిలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, గాంధీల తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, ఆర్.ఎస్. చీమా వాదనలు వినిపించారు.
ట్రయల్ కోర్టు ఏం చెప్పింది?
డిసెంబర్ 16న ట్రయల్ కోర్టు, షెడ్యూల్డ్ ఆఫెన్స్‌పై ఎఫ్‌ఐఆర్ లేకుండా పీఎంఎల్‌ఏ కింద మనీలాండరింగ్ కేసులో విచారణ చేపట్టడం చట్టబద్ధం కాదని పేర్కొంది. ఈడీ దర్యాప్తు ఒక ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ప్రారంభమైందని, పోలీస్ లేదా అధికృత దర్యాప్తు సంస్థ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ లేదని స్పష్టం చేసింది.
ఈడీ వాదన
హైకోర్టులో ఈడీ తరఫున వాదిస్తూ, ట్రయల్ కోర్టు దృక్పథం తీవ్రంగా తప్పుదారి పట్టిందని తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. ఈ తీర్పు భవిష్యత్తులో అనేక మనీలాండరింగ్ కేసులపై ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పోలీసుల మాదిరిగానే ఈడీ కూడా ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేస్తుందని ఆయన వాదించారు. ఈడీ పిటిషన్‌లో, ట్రయల్ కోర్టు ఉత్తర్వు వల్ల ప్రైవేట్ ఫిర్యాదుల ఆధారంగా నమోదైన కేసుల్లో నిందితులకు హాల్ పాస్(నిబంధనల నుంచి తప్పించుకునే అనుమతి) ఇచ్చినట్లవుతుందని ఆరోపించింది. గాంధీలు తదితరులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, కేవలం న్యాయపరమైన వ్యాఖ్యానాలతో వాటిని తోసిపుచ్చడం సరికాదని తెలిపింది. ఈ ఉత్తర్వు జుడీషియల్ లెజిస్లేషన్ లోపంతో కూడుకున్నదని ఈడీ అభిప్రాయపడింది.
గాంధీల తరఫు వాదన
అభిషేక్ సింఘ్వీ ఈడీ వాదనలను ఖండించారు. ఈడీ అభిప్రాయానికి భిన్నమైన న్యాయపరమైన కోణం ఉందని పేర్కొంటూ, నోటీసును స్వీకరించి సమాధానం దాఖలు చేస్తామని తెలిపారు.
కేసు నేపథ్యం
బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి 2014లో దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు మొదలైంది. అయితే ఆ ఫిర్యాదుపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ట్రయల్ కోర్టు గుర్తు చేసింది. అయినా, 2021 జూన్ 30న ఈడీ ఎఫ్‌ఐఆర్‌కు సమానమైన ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిందని కోర్టు పేర్కొంది. ఈడీ ఆరోపణల ప్రకారం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మరణించిన కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, ఇతరులతో కలిసి కుట్ర పన్ని, నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన సుమారు రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించింది. యంగ్ ఇండియన్ సంస్థలో గాంధీలకు 76 శాతం వాటా ఉందని, రూ.90 కోట్ల రుణం పేరుతో ఏజేఎల్ ఆస్తులను మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నారని ఈడీ పేర్కొంది.
