
నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీలకు ఊరట
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై కోర్టు విచారణకు స్వీకరించడానికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అక్రమాలు పూర్తిగా వెలుగులోకి వచ్చాయని కాంగ్రెస్ మంగళవారం వ్యాఖ్యానించింది. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరణతో నడిపిందేనని పార్టీ ఆరోపించింది.
కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనాతే ఒక ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకత్వంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ చేపట్టిన చర్యలు పూర్తిగా అక్రమమైనవీ, దురుద్దేశపూరితమైనవీ అని కోర్టు స్పష్టం చేసిందని అన్నారు. మోడీ ప్రభుత్వ దురుద్దేశం, అక్రమాల స్వభావం పూర్తిగా బయటపడింది. ఈ కేసుపై ఈడీకి అధికార పరిధి లేదని కోర్టు తేల్చింది. ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా ఈ కేసును కొనసాగించారు. దశాబ్ద కాలంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీపై మోడీ ప్రభుత్వం రాజకీయ కక్షతో ఈ కేసును నడిపింది. ఇప్పుడు అది దేశ ప్రజల ముందే బహిర్గతమైందని ఆమె పేర్కొన్నారు. డబ్బు లాండరింగ్ కేసే లేదు, నేరాల ద్వారా వచ్చిన ఆదాయం లేదు, ఆస్తుల బదిలీ లేదు. ఇవన్నీ రాజకీయ వేట, ప్రచారం, పరువు హననం కోసం చేసిన నిరాధార ఆరోపణలే. ఇవన్నీ ఈ రోజు ఓడిపోయాయి అని సుప్రియా శ్రీనాతే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, నాయకులు సత్యం కోసం, ప్రతి భారతీయుడి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.
మేము భయపడం. భవిష్యత్తులో కూడా భయపడబోం. ఎందుకంటే మేము సత్యం కోసం పోరాడుతున్నామని అన్నారు.
దురుద్దేశపూర్వకంగానే కేసు:కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్
ఈ తీర్పు ద్వారా మోడీ ప్రభుత్వం చేసిన అక్రమ, దురుద్దేశపూరిత రాజకీయ లక్ష్యీకరణను కోర్టు బట్టబయలు చేసింది. మొదటి రోజు నుంచే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఎలాంటి చట్టపరమైన ఆధారాలు లేకుండా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ తీర్పు మా వాదనను పూర్తిగా సమర్థించింది అని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు మరో ఐదు గురిపై ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ చేయడానికి కోర్టు నిరాకరించింది. ఈ చార్జ్‌షీట్ ఒక ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా సాగిన దర్యాప్తుపై ఆధారపడి ఉందని, ప్రాథమిక నేరానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ లేకపోవడంతో ఇది చట్టపరంగా అనుమతించదగింది కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
తీర్పు ఆపరేటివ్ భాగాన్ని న్యాయమూర్తి చదువుతూ ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని, అందువల్ల ఈడీ వాదనలను మెరిట్స్‌పై ఇప్పుడే పరిశీలించడం ముందస్తు చర్యే అవుతుందని పేర్కొన్నారు.ఈ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు దివంగత నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, అలాగే సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ సంస్థపై కుట్ర, మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయని ఈడీ పేర్కొంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన, నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే సంస్థ ఆస్తులను సుమారు రూ.2,000 కోట్ల విలువతో యంగ్ ఇండియన్ దుర్వినియోగం చేసిందని ఈడీ ఆరోపించింది. యంగ్ ఇండియన్‌లో గాంధీ కుటుంబం 76 శాతం వాటా కలిగి ఉందని, రూ.90 కోట్ల రుణం పేరుతో ఏజేఎల్ ఆస్తులను మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
